కలం, వెబ్ డెస్క్ : హైదరాబాద్ – విజయవాడ హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. నల్లగొండ జిల్లా చిట్యాల (Chityala Bus Fire) మండలం పెద్ద కాపర్తి శివారులో జాతీయ రహదారి-65పై ప్రయాణికులతో వెళ్తున్న ఓ ట్రావెల్స్ బస్సు క్షణాల్లోనే కాలిబూడిదైంది. లింగంపల్లి నుంచి కాకినాడ వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ రోజు తెల్లవారుజామున 02:15 సమయంలో బస్సు ఇంజిన్‌లో సాంకేతిక లోపం తలెత్తడంతో మంటలు చెలరేగాయి.
అయితే ప్రమాదాన్ని గమనించిన డ్రైవర్ అప్రమత్తంగా వ్యవహరించి వెంటనే బస్సును రోడ్డుపక్కన నిలిపివేశాడు. దీంతో ప్రయాణికులందరినీ క్షణాల్లో బస్సు నుంచి బయటకు దించడంతో పెద్ద విషాదం తప్పింది. బస్సుల్లోని 36 మంది ప్రయాణికులు సురక్షితంగా బయపడ్డారు. ప్రయాణికులు దిగిన తర్వాత కాసేపటికే మంటలు బస్సు మొత్తానికి వ్యాపించాయి. విషయం తెలుసుకున్న ఫైర్ సిబ్బంది.. ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. బస్సులో మంటలు చెలరేగడానికి గల కారణాలపై అధికారులు విచారణ చేపట్టారు.

