పద్మశాలి ఉద్యోగులకు టీపీయూఎస్ భరోసా

కలం, పాల్వంచ : ఉద్యోగులు విధి నిర్వహణలో భాగంగా ఎలాంటి ఇబ్బందులు, ఒత్తిళ్లు లేదా వేధింపులు ఎదుర్కొన్నప్పటికీ ఆవేశానికి లోనై తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దని తెలంగాణ పద్మశాలి ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు (TPUS State President) ఈగ వెంకటేశ్వర్లు పిలుపునిచ్చారు. ఏ ఉద్యోగి కూడా సమస్యలతో ఒంటరిగా కుంగిపోకుండా మనోధైర్యంతో వాటిని ఎదుర్కోవాలని సూచించారు. టీపీయూఎస్ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన రాష్ట్ర కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు.

ఉద్యోగరీత్యా ఎదురయ్యే క్లిష్ట పరిస్థితులను వెంటనే సంఘం దృష్టికి తీసుకురావాలని, రాష్ట్ర కమిటీ వారికి పూర్తి అండగా నిలుస్తుందని భరోసా ఇచ్చారు. అవసరమైతే సంఘం ఆధ్వర్యంలోని న్యాయ సహాయ కమిటీని సంప్రదించాలని సూచించారు. కమిటీ ద్వారా అవసరమైన న్యాయపరమైన సలహాలు, సూచనలతో పాటు తగిన సహకారం అందిస్తామని స్పష్టం చేశారు. పద్మశాలి ఉద్యోగుల హక్కులు, ఆత్మగౌరవం, సంక్షేమ పరిరక్షణకు సంఘం ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటుందని తెలిపారు. ఈ సమావేశం సందర్భంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సంఘం అధ్యక్షులుగా సేవలందించిన స్వర్గీయ అనంతుల లక్ష్మీనారాయణ కుటుంబానికి రాష్ట్ర సంఘం తరఫున రూ.లక్ష ఆర్థిక సహాయాన్ని ఆదివారం అందజేశారు. స్వర్గీయ లక్ష్మీనారాయణ కుమార్తె అనంతుల మధులికకు రాష్ట్ర అధ్యక్షులు ఈగ వెంకటేశ్వర్లు చేతుల మీదుగా చెక్కును అందించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వర్గీయ లక్ష్మీనారాయణ సంఘానికి అందించిన సేవలు చిరస్మరణీయమని కొనియాడారు. సభ్యుల సంక్షేమంతో పాటు ఆపదలో ఉన్న కుటుంబాలకు అండగా నిలవాలనే ఉద్దేశంతోనే ఈ ఆర్థిక సాయం అందించినట్లు తెలిపారు. ఉద్యోగుల సంక్షేమం, వారి కుటుంబాల భద్రత కోసం రాష్ట్ర సంఘం నిరంతరం కృషి చేస్తుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో టీపీయూఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆలె బాలకృష్ణ, రాష్ట్ర ఉపాధ్యక్షులు గంజి రామ్మోహన్, పిట్ట ఉమాదేవి, రాష్ట్ర కోశాధికారి రాపోలు సోమేశ్వర్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రధాన కార్యదర్శి దూలం నటరాజ్ తదితరులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>