కలం, వనపర్తి : ఉపాధ్యాయులు, విద్యాశాఖ ఉద్యోగుల పెండింగ్ సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ.. టీపీయూఎస్ (TPUS) ఆధ్వర్యంలో వనపర్తి(Wanaparthy) పట్టణంలోని మర్తికుంట ధర్నా చౌక్‌లో సోమవారం ఒకరోజు ధర్నా నిర్వహించారు. టీపీయూఎస్ జిల్లా అధ్యక్షుడు కృష్ణ, జిల్లా ప్రధాన కార్యదర్శి సీజీ శశివర్ధన్ ఆధ్వర్యంలో జరిగిన ఈ నిరసన కార్యక్రమంలో ఉపాధ్యాయులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. పెండింగ్‌లో ఉన్న ఆరు డీఏలను వెంటనే విడుదల చేయాలని, 51 శాతం పీఆర్‌సీని ప్రకటించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సీపీఎస్‌ను రద్దు చేసి పాత పెన్షన్ విధానం (OPS)ను పునరుద్ధరించాలని కోరారు.
అలాగే జీఓ 317 బాధితులకు న్యాయం చేయాలని, జీఓ 25ను రద్దు చేయాలని, 2010కు ముందు సేవలో ఉన్న ఉపాధ్యాయులకు టెట్ మినహాయింపు కల్పించాలని డిమాండ్ చేశారు. సర్వ శిక్ష అభియాన్, కేజీబీవీ ఉపాధ్యాయులకు కనీస టైమ్‌స్కేల్ అమలు చేయాలని, ప్రత్యేక వార్డెన్లను నియమించాలని కోరారు. మోడల్ స్కూల్ ఉపాధ్యాయులకు 010 పద్ధతిలో వేతనాలు చెల్లించాలని, ప్రభుత్వ పాఠశాలలలో మౌలిక వసతుల కోసం ప్రతి ఏడాది జూన్ మొదటి వారంలోనే గ్రాంట్‌లు విడుదల చేయాలని, కేజీబీవీ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు.
2003 డీఎస్సీ ఉపాధ్యాయులకు పాత పెన్షన్ విధానం అమలు చేయాలని డిమాండ్ చేశారు. తమ సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని టీపీయూఎస్ నాయకులు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో టీపీయూఎస్ రాష్ట్ర అధ్యక్షుడు రాజశేఖర్, రాష్ట్ర కార్యదర్శి అమరేందర్ రెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వరప్రసాద్ గౌడ్, రాష్ట్ర అకాడమిక్ కన్వీనర్ విష్ణువర్ధన్, కరుణ, వరలక్ష్మి, భగవద్గీత రవికుమార్, ఈశ్వర్‌తో పాటు పలువురు ఉపాధ్యాయులు, ఉద్యోగులు పాల్గొన్నారు.

