కలం, మెదక్ బ్యూరో : సంగారెడ్డి (Sangareddy) జిల్లా పాశమైలారం పారిశ్రామిక వాడలో జరిగిన సిగాచి పరిశ్రమ పేలుడు (Sigachi Blast) ఘటనలో మరణించిన 54 మంది కార్మికుల కుటుంబాలకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ పీపుల్ జాయింట్ యాక్షన్ కమిటీ (TPJAC) ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట మహా ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాలో సుమారు 60 మంది బాధిత కుటుంబ సభ్యులు, వివిధ ప్రజాసంఘాల నేతలు పాల్గొన్నారు. ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన కార్మికుల కుటుంబాలకు పూర్తి స్థాయి న్యాయం చేయాలని వారు డిమాండ్ చేశారు.
వెంటనే ఒక్కో కుటుంబానికి రూ. 1 కోటి పరిహారం చెల్లించాలని, అలాగే పీఎఫ్, ఈఎస్ఐతో పాటు అదనంగా నికర పరిహారం ఇవ్వాలని వారు కోరారు. ప్రమాదానికి (Sigachi Blast) కారణమైన అధికారుల నిర్లక్ష్యంపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని కూడా డిమాండ్ చేశారు. అంతేకాకుండా బాధిత కుటుంబ సభ్యులకు ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించాలని కూడా విజ్ఞప్తి చేశారు. ధర్నా సమయంలో పోలీసులకు, బాధితులకు మధ్య తీవ్ర వాగ్వివాదం, తోపులాట జరగడంతో కలెక్టరేట్ వద్ద ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. ఈ కార్యక్రమంలో TPJAC కన్వీనర్ వై. అశోక్ కుమార్, రాష్ట్ర కో-కన్వీనర్ కన్నెగంటి రవి, అడ్వకేట్ వసుధ నాగరాజ్, మీరా సంఘమిత్ర తదితరులు పాల్గొన్నారు.
Read Also: మసాజ్ సెంటర్‌లో మోడీ..! సోషల్ మీడియాలో వీడియో వైరల్
Follow Us On: Pinterest

