కలం, నిజామాబాద్ బ్యూరో: జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలన్న ప్రధాన డిమాండ్‌తో నిరసనగా 28న రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేపడుతున్నట్టు TPCC చీఫ్ (TPCC Chief) మహేష్ కుమార్ గౌడ్ (Mahesh Kumar Goud) వెల్లడించారు. హైదరాబాద్ ట్యాంక్ బండ్ అంబేద్కర్ విగ్రహం వద్ద 10.30 గంటలకు భారీ నిరసన చేపడుతున్నట్టు ప్రకటించారు.
ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) విషయంలో ఎన్నికల సంఘం వ్యవహరిస్తున్న తీరు మొదటి నుంచి అనేక అనుమానాలకు తావిస్తుందని మహేష్ కుమార్ గౌడ్ విమర్శించారు. ఎన్నికల సంఘం ప్రవర్తిస్తున్న తీరుకు నిరసనగా ఏఐసీసీ పిలుపు మేరకు ఈ నెల 28న రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాలలో నిరసన కార్యక్రమాలు చేపట్టాలని ఆయన కాంగ్రెస్ శ్రేణులకు పిలుపునిచ్చారు.
కేంద్ర ఎన్నికల చీఫ్ కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలన్న ప్రధాన డిమాండ్‌తో నిరసన కార్యక్రమాలు చేపట్టాలని ఆయన అన్నారు. హైదరాబాద్ లోని ట్యాంక్ బండ్ వద్ద అంబేద్కర్ విగ్రహం వద్ద సోమవారం ఉదయం 10.30 గంటలకు భారీ ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపట్టాలని ఆయన పిలుపునిచ్చారు.
ఈ విషయాలపై ఆయన ఒక ప్రకటన చేస్తూ ఓటు ప్రజాస్వామ్యానికి పునాది అని, ప్రతి పౌరుడికి హక్కు అని పౌరుల హక్కులను కాపాడడం ఎన్నికల సంఘం కనీస బాధ్యత అని అన్నారు. గత 10 నెలల్లో ఓటర్ల జాబితా సవరణకు సంబంధించిన అంశాలపై చీఫ్ ఎన్నికల కమిషనర్‌ను విభేదిస్తూ ఎన్నికల కమిషనర్లు సుఖ్బీర్ సింగ్ సంధు, వివేక్ జోషిలు 14 సార్లు అభ్యంతరాలు వ్యక్తం చేశారన్న అంశాలు వెలుగులోకి వచ్చాయని అన్నారు.
వారి అభ్యంతరాలు కొత్త ఓటర్ల నమోదు, ఓటర్ల పేర్ల తొలగింపు, ఓటర్ల డేటాబేస్ నిర్వహణ, ఎన్నికల జాబితా సాఫ్ట్‌వేర్‌కు సంబంధించిన అంశాలు కూడా ఉన్నాయన్నారు. కొత్తగా ఓటు హక్కు పొందే పౌరులు ఉపయోగించే ఫారం-6లో సర్ కు సంబంధించిన ప్రశ్నలను చేర్చడంపై ఇద్దరు ఎన్నికల కమిషనర్లు అభ్యంతరాలు వ్యక్తం చేసినట్లు బయటకు వచ్చిందని గుర్తు చేశారు.
ఈ ప్రక్రియలో తలెత్తిన అనుమానాలు, ఆ మార్పులకు చట్టపరమైన ఆధారం ఏమిటి? అనే విషయాలను ఎన్నికల సంఘం ప్రజలకు స్పష్టంగా వెల్లడించాలని డిమాండ్ చేశారు. ఫారం-6లో చేసిన మార్పులపై ఇద్దరు కమిషనర్లు అభ్యంతరాలు వ్యక్తం చేసినట్లు వచ్చిన వార్తల నేపథ్యంలో ఎన్నికల సంఘం దీనిపై పూర్తి వివరణ ఇవ్వాలని మహేష్ కుమార్ గౌడ్ డిమాండ్ చేశారు.
ఓటర్ల డేటాలో మార్పులు చేసే విధానం ఉంటే, క్షేత్రస్థాయిలో చట్టబద్ధమైన అధికారాలు కలిగిన Electoral Registration Officers (EROs) పాత్ర, వారి పర్యవేక్షణ, బాధ్యత ఏమిటో ఎన్నికల సంఘం స్పష్టం చేయాలని, ఓటర్ల డేటా ఎవరు మార్చారు? ఎప్పుడు మార్చారు? ఏ కారణంతో మార్చారు? ఏ అధికారి అనుమతితో మార్చారు? అనే వివరాలకు ఆడిట్ ట్రయల్ ఉండాలని, అత్యంత బాధ్యత యుతంగా ఉండాల్సిన అవసరం ఉందని అన్నారు.
సర్ ప్రక్రియలో పెద్ద సంఖ్యలో ఓటర్ల పేర్లు డ్రాఫ్ట్ జాబితాల నుంచి తొలగించబడినట్లు నివేదికలు వెలువడ్డాయని, పేర్ల తొలగింపునకు కారణాలు ఏమిటి, ఎంత మంది పేర్లు తొలగించారు? ఎంతమంది అభ్యంతరాలు తెలిపారు? ఎన్ని పేర్లు తిరిగి చేర్చారు? అనే పూర్తి వివరాలను రాష్ట్రాల వారీగా, నియోజకవర్గాల వారీగా ఎన్నికల సంఘం బహిరంగపరచాలని పీసీసీ చీఫ్ డిమాండ్ చేశారు.
చీఫ్ ఎలక్షన్ కమిషనర్ జ్ఞానేష్ కుమార్ నాయకత్వంలోని ఎన్నికల సంఘం ఎవరి ప్రయోజనాల కోసం పనిచేస్తుందన్న ప్రశ్నలు ప్రజల్లో తలెత్తకుండా, ప్రతి నిర్ణయం చట్టబద్ధంగా, పారదర్శకంగా, జవాబు దారీతనంతో ఉండేలా చూడాలని ఆయన అన్నారు. ఒక్క అర్హుడైన ఓటరు పేరు కూడా పొరపాటున తొలగించకుండా చూడటం ఎంత ముఖ్యమో, అనర్హమైన పేర్ల విషయంలో చట్టం, నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోవడం కూడా అంతే ముఖ్యమని పేర్కొన్నారు.
ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు అత్యంత కీలకమైన రాజ్యాంగ హక్కు అని, అందువల్ల ఓటర్ల జాబితా తయారీ, సవరణ, పేర్ల తొలగింపు, కొత్త ఓటర్ల నమోదు, డేటా మార్పులు వంటి ప్రతి దశలో పకడ్బందీగా ఉండాలని ఆయన వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి ఎన్నికల సంఘం చర్యలను అనుమానిస్తున్నదని ఇప్పుడు ఇద్దరు కమిషనర్లు కూడా అవే అనుమానాలు వ్యక్తం చేయడంతో దేశంలో ఈసీ కొంత కాలంగా చేసిన చర్యలు కేంద్రంలోని అధికార పార్టీకి లాభం చేకూర్చిందన్న అనుమానాలు మరింత బలపడ్డాయని ఆరోపించారు. ఈ అంశాలపై కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా చేపట్టిన నిరసన, ఉద్యమాలకు ప్రజాస్వామ్య వాదులు, సంఘాలు పెద్ద ఎత్తున మద్దతు ఇవ్వాలని కోరారు.

