కలం, వెబ్ డెస్క్ : ఆస్తి తగాదాలు కుటుంబ బంధాలను బలితీసుకుంటున్నాయనడానికి నిదర్శనంగా నిలిచే దారుణ సంఘటన హైదరాబాద్‌లోని కూకట్‌పల్లిలో (Kukatpally ) చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే .. కూకట్‌పల్లి ఆల్విన్ కాలనీకి చెందిన టి. నాగార్జున ఒక బ్యాంకు ఉద్యోగిగా పనిచేస్తున్నారు. గత నాలుగేళ్లుగా తమ కుటుంబంలో ఆస్తి వివాదం నడుస్తోందని, ఈ క్రమంలో తన అన్న, వదిన , అలాగే వదిన సోదరుడు కలిసి తమను నిరంతరం తీవ్ర వేధింపులకు గురిచేస్తున్నారని ఆయన వెల్లడించారు.
కేవలం తనపైనే కాకుండా, తీవ్ర అనారోగ్యంతో పక్షవాతానికి గురై మంచానికే పరిమితమైన కన్న తల్లిపై కూడా వారు పలుమార్లు విచక్షణారహితంగా భౌతిక దాడులు చేశారని నాగార్జున ఆవేదన వ్యక్తం చేశారు. ఈ దాడుల్లో తమకు తీవ్ర గాయాలయ్యాయని, అందుకు సంబంధించిన పక్కా ఆధారాలతో పాటు ఇంట్లో రికార్డయిన సీసీటీవీ దృశ్యాలు కూడా తన వద్ద ఉన్నాయని బాధితుడు తెలిపారు. ఈ మేరకు సీసీటీవీ దృశ్యాలను సోషల్ మీడియాలో రిలీజ్ చేశారు.
అయితే, తమపై జరుగుతున్న ఈ అరాచకాలపై స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేసినప్పటికీ ఇప్పటివరకు ఎలాంటి ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదని నాగార్జున ఆరోపించారు. న్యాయం కోసం అధికారుల చుట్టూ తిరుగుతున్నా స్పందన కరువైందని ఆవేదన వ్యక్తం చేశారు. అతను రిలీజ్ చేసిన సీసీటీవీ ఫుటేజ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీంతో పక్షవాతంతో ఉన్న వృద్ధురాలిపై దాడికి పాల్పడిన వారిపై వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు, నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు.

