కలం, వెబ్ డెస్క్ : కర్నూలు జిల్లాలో తెల్లవారుజామున పెను విషాదం (Kurnool Road Accident) చోటుచేసుకుంది. మంత్రాలయం (Mantralayam Accident) మండలం చిలకల డోనా గ్రామ సమీపంలో జరిగిన భీకర రోడ్డు ప్రమాదంలో ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయారు. అతివేగంతో వస్తున్న లారీ, బొలెరో వాహనాన్ని బలంగా ఢీకొట్టడంతో ఈ ప్రమాదం సంభవించింది. ఢీకొన్న వేగానికి బొలెరో వాహనం పూర్తిగా నుజ్జునుజ్జు కాగా, అందులో ప్రయాణిస్తున్న ఎనిమిది మంది అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు.
మృతులంతా కర్ణాటక రాష్ట్రానికి చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. వీరంతా మంత్రాలయం శ్రీ రాఘవేంద్ర స్వామివారి దర్శనం కోసం వెళ్తుండగా ఈ విషాదం చోటుచేసుకుంది. ప్రమాద సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, స్థానికుల సహాయంతో సహాయక చర్యలు చేపట్టారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన మరికొందరిని చికిత్స నిమిత్తం ఎమ్మిగనూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

