థియేటర్స్ వివాదం మళ్లీ ముందుకు..!.. సినిమాలు వాయిదా పడేనా?

కలం, వెబ్ డెస్క్ : టాలీవుడ్ (Tollywood) ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్ల మధ్య దశాబ్దాలుగా జరుగుతున్న రెంటల్ వివాదానికి తెర దించుతూ తెలంగాణ ఫిలిం చాంబర్ ఆఫ్ కామర్స్ (టీఎఫ్‌సీసీ) ఓ నిర్ణయాన్ని ప్రకటించిన విషయం తెలిసిందే. రెంటల్ సిస్టమ్ స్థానంలో పర్సంటేజీ సిస్టమ్‌ను అమలు చేస్తూ నిర్ణయించింది. ఈ కొత్త విధానానికి రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లోని 23 ప్రధాన థియేటర్ల యాజమాన్యాలు తమ అంగీకారం కూడా తెలిపాయి . సదరు 23 సింగిల్ స్క్రీన్ థియేటర్లలో ఏప్రిల్ 3వ తేదీ నుంచి కొత్త పద్ధతిని అమలులోకి తెచ్చారు. అయితే, పర్సంటేజీ విధానంపై టీఎఫ్‌సీసీ ఇటీవల తీసుకున్న నిర్ణయాన్ని ‘గిల్డ్’ ప్రొడ్యూసర్లు వ్యతిరేకిస్తున్నారు. ఈ విషయాన్ని స్పష్టం చేస్తూ యాక్టివ్ తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ బుధవారం ఓ ప్రకటన విడుదల చేశారు.

మళ్లీ థియేటర్స్ వివాదం..

”యాక్టివ్ తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ గిల్డ్ సభ్యులమైన మేము పర్సంటేజీ విధానంలో సినిమాల ప్రదర్శనకు సంబంధించి తెలంగాణ ఫిలిం చాంబర్ ఆఫ్ కామర్స్ (టీఎఫ్‌సీసీ) తీసుకున్న ఏకపక్ష నిర్ణయానికి ఆమోదం తెలపడం లేదు. ఎగ్జిబిటర్లతో చర్చలు జరిపిన తర్వాత మా నిర్ణయాలను తెలియజేస్తాం. అప్పటివరకు ప్రస్తుతం అమలులో ఉన్న పాత విధానా (రెంటల్ సిస్టమ్)న్నే కొనసాగించాలని కోరుకుంటున్నాం. టీఎఫ్‌సీసీ నిర్ణయించిన విధానంపై పనిచేసే థియేటర్లలో మా సినిమాలను ప్రదర్శించడానికి మేము సుముఖంగా లేమని మరోసారి స్పష్టం చేస్తున్నాం” అని పేర్కొన్నారు. టీఎఫ్‌సీసీ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్న నిర్మాతల్లో రవిశంకర్ యలమంచిలి (మైత్రి), సుధాకర్ చెరుకూరి (ఎస్‌ఎల్‌వీ సినిమాస్), టీజీ విశ్వప్రసాద్ (పీపుల్ మీడియా ఫ్యాక్టరీ), నాగవంశీ (సితార ఎంటర్‌టైన్‌మెంట్స్), రవికిషోర్ పీవీ (స్రవంతి), సుప్రియ యార్లగడ్డ (అన్నపూర్ణ స్టూడియోస్), బాపినీడు బీ (ఎస్‌వీసీసీ), స్వప్నా దత్ (స్వప్న సినిమా), సాహు గారపాటి (షైన్‌స్క్రీన్స్), రాజీవ్ రెడ్డి వై (ఫస్ట్ ఫ్రేమ్), వెంకట సతీశ్ కిలారు (వృద్ధి సినిమాస్), హీరో నాని (వాల్ పోస్టర్ సినిమా), చిట్టూరి శ్రీనివాసరావు (శ్రీనివాస వెండితెర), బన్నీ వాసు (బన్నీ వాస్ వర్క్స్), ఎస్‌కేఎన్ (మాస్ మూవీ మేకర్స్), ధీరజ్ మొగిలినేని (ధీరజ్ మొగిలినేని ఎంటర్‌టైన్‌మెంట్) ఉన్నారు.

పలు సినిమాలు వాయిదా?

కాగా, పర్సంటేజ్ విధానం వల్ల తమకు లాభాలు తగ్గే అవకాశం ఉందని నిర్మాతలు భావిస్తున్నారు. ఈ పరిస్థితి త్వరలో విడుదలకు సిద్ధంగా ఉన్న డెకాయిట్, lik (లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ) వంటి సినిమాలపై ప్రభావం చూపే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో పలు సినిమాల రిలీజ్ డేట్ లు మారే ఛాన్స్ ఉందని సమాచారం అందుతోంది. సినీ పరిశ్రమలో అనిశ్చితి నెలకొనడంతో ప్రేక్షకులు కూడా అయోమయంలో ఉన్నారు. పరిశ్రమలో సమస్యకు త్వరగా పరిష్కారం రాకుంటే సినిమా వ్యాపారం దెబ్బతినే అవకాశం ఉందని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>