కలం, కరీంనగర్ బ్యూరో: రాష్ట్రవ్యాప్తంగా ఉద్యోగులు ఎదుర్కొంటున్న వివిధ సమస్యలు, సందేహాలు, వాటి పరిష్కారాలకు ‘ఉద్యోగుల గొంతుక’ పుస్తకం వేదికగా నిలుస్తుందని టీఎన్జీవోల జిల్లా (TNGO Karimnagar) అధ్యక్షుడు దారం శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. టీఎన్జీవోల ఆధ్వర్యంలో ఇటీవల ఆవిష్కరించబడిన ‘ఉద్యోగుల గొంతుక’ వార్షిక పుస్తకాన్ని ఆయన నాయకత్వంలో ప్రతినిధుల బృందం జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా, ఐఏఎస్ కి మర్యాదపూర్వకంగా అందజేశారు.
ఈ సందర్భంగా దారం శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ.. ‘ఉద్యోగుల గొంతుక’ వార్షిక పుస్తకంలో రాష్ట్రవ్యాప్తంగా టీఎన్జీవో సంఘం నిర్వహించిన వివిధ సంక్షేమ కార్యక్రమాలు, ఉద్యోగుల సందేశాలు, వారి సమస్యలు–సమాధానాలు, అనుభవజ్ఞులైన ఉద్యోగ సంఘ నాయకుల సూచనలు పొందుపరిచినట్లు వెల్లడించారు. ఉద్యోగుల సమస్యలను ఎప్పటికప్పుడు ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లడంతో పాటు ఉద్యోగులకు ఉపయోగపడే సమగ్ర సమాచారాన్ని అందించడమే ఈ పుస్తకం యొక్క ముఖ్య ఉద్దేశమని స్పష్టం చేశారు.
ఉద్యోగుల సంక్షేమానికి ప్రాధాన్యం: కలెక్టర్
పుస్తకాన్ని స్వీకరించిన జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా, ఐఏఎస్ టీఎన్జీవో సంఘ ప్రతినిధులను ప్రత్యేకంగా అభినందించారు. అనంతరం ఉద్యోగుల సమస్యలను అడిగి తెలుసుకుంటూ వారి సంక్షేమానికి సంబంధించిన పలు అంశాలపై చర్చించారు. ముఖ్యంగా న్యూ ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ (EHS) అమలు తీరుపై ప్రత్యేకంగా సమీక్షించారు. ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ ద్వారా ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులకు మెరుగైన వైద్య సేవలు అందేలా చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హామీ ఇచ్చారు. వెల్నెస్ సెంటర్లలో అనుభవజ్ఞులైన వైద్యులను అందుబాటులో ఉంచి నాణ్యమైన చికిత్స అందిస్తామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో టీఎన్జీవో నాయకులు లక్ష్మణరావు, కాళీచరణ్, సర్దార్ హర్మీందర్ సింగ్, రాగి శ్రీనివాస్, గూడ ప్రభాకర్ రెడ్డి, రాజు, డాక్టర్ అరవింద్ రెడ్డి, గంగారపు రమేష్, మామిడి రమేష్, పూర్ణచందర్ రెడ్డి, నాలుగో తరగతి ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు కోట రామస్వామి, కార్యదర్శి శంకర్ తదితరులు పాల్గొన్నారు.

