ప్రజా సమస్యల పరిష్కారం అత్యంత ప్రాధాన్యం : సీతక్క

కలం, మహబూబ్ నగర్ బ్యూరో : ప్రజా సమస్యల పరిష్కారం, గ్రామాల అభివృద్ధి, మౌలిక వసతుల కల్పనకు రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని మంత్రి సీతక్క (Minister Seethakka) తెలిపారు. గురువారం నారాయణపేట జిల్లాలోని మక్తల్ నియోజకవర్గంలోని 25 గ్రామాలలో 178 కోట్ల 84 లక్షల నిధులతో బీటీ రోడ్లు, పలు అభివృధి పనులకు మక్తల్ లోని ఓ ఫంక్షన్ హాల్ లో జిల్లా మంత్రి డాక్టర్ వాకిటి శ్రీహరితో కలిసి సీతక్క శంకు స్థాపన చేశారు.

25 సంవత్సరాల క్రితం జిల్లా మంత్రి వాకిటి శ్రీహరి తన రాజకీయ ప్రస్థానం సర్పంచి గా ప్రారంభించిన సందర్భంగా మంత్రి సీతక్క.. శ్రీహరి – లలిత దంపతులను శాలువాతో సత్కరించారు. ఈ సందర్భంగా సీతక్క మాట్లాడుతూ.. సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్రంలో రైతు రుణమాఫీ, రైతు భరోసా, ఇందిరమ్మ ఇళ్లు, ఉచిత విద్యుత్, సన్నబియ్యం పంపిణీ, మహిళా సంక్షేమం తదితర కార్యక్రమాలు అమలు చేస్తున్నామని వెల్లడించారు.

శ్రీహరి 25 ఏళ్ల రాజకీయ ప్రస్థానం స్ఫూర్తిదాయకం అని సీతక్క కొనియాడారు. మక్తల్ ఎమ్మెల్యేగా, రాష్ట్ర మంత్రిగా ఎదిగిన వాకిటి శ్రీహరి 25 ఏళ్ల రాజకీయ ప్రస్థానం క్రమశిక్షణ, అంకితభావం, నిరంతర ప్రజాసేవకు నిదర్శనమని ఆమె కొనియాడారు. సర్పంచ్‌గా ప్రారంభమైన ఆయన రాజకీయ ప్రస్థానం రాష్ట్ర మంత్రిగా ఎదిగే స్థాయికి చేరుకోవడం వెనుక 25 ఏళ్ల కఠోర శ్రమ, ప్రజల పట్ల నిబద్ధత ఉన్నాయని పేర్కొన్నారు.

అభివృద్ధి పనులపై విస్తృత ప్రచారం చేయాలి

మక్తల్ నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధి పనులను ప్రజలకు వివరించేందుకు ప్రత్యేకంగా అభివృద్ధి ప్రగతి నివేదికను రూపొందించాలని సీతక్క సూచించారు. రెండున్నర సంవత్సరాల కాలంలో నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలో చేపట్టిన రోడ్లు, భవనాలు, పాఠశాలలు, అంగన్‌వాడీ కేంద్రాలు, వంతెనలు, ఇతర మౌలిక వసతుల వివరాలను అందులో పొందుపరచాలని సూచించారు. ప్రభుత్వం మంజూరు చేసిన నిధులతో చేపడుతున్న అభివృద్ధి పనులను వేగవంతంగా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలన్నారు. అభివృద్ధి కార్యక్రమాలపై ప్రజలకు వాస్తవాలను తెలియజేయాల్సిన బాధ్యత పార్టీ నాయకులు, కార్యకర్తలపై ఉందన్నారు.

పార్టీ శ్రేణులు ఐక్యంగా పనిచేయాలి

పార్టీ నాయకులు, కార్యకర్తలు గ్రూపులు, వర్గాలకు అతీతంగా ఐక్యంగా పనిచేయాలని మంత్రి సీతక్క పిలుపునిచ్చారు. మంచి నాయకత్వం అంటే ప్రతి ఒక్కరినీ కలుపుకొని ముందుకు సాగడమేనని, పార్టీ బలోపేతానికి సమష్టి కృషి అవసరమని అన్నారు.నాయకుల మధ్య అనవసర విభేదాలు అభివృద్ధిపై ప్రభావం చూపుతాయని, ప్రజా సమస్యల పరిష్కారం, అభివృద్ధి కార్యక్రమాల సాధనపైనే దృష్టి పెట్టాలని సూచించారు. పార్టీ బలంగా ఉంటేనే నాయకులు, కార్యకర్తలకు మరిన్ని అవకాశాలు లభిస్తాయని తెలిపారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>