కలం, నల్లగొండ బ్యూరో: గత గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో అనూహ్య ఫలితాలతో ప్రధాన రాజకీయ పక్షాలకు ధీటుగా ఓట్లు రాబట్టిన విద్యావేత్త, నిరుద్యోగ జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు పాలకూరి అశోక్ కుమార్ (Palakuri Ashok Kumar) మరోసారి ఎన్నికల బరిలోకి దిగుతున్నారు. నల్గొండలోని ఎస్పీఆర్ గార్డెన్స్‌లో సోమవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఖమ్మం – వరంగల్ – నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించారు.
గత ఎన్నికల్లో తనకు వచ్చిన మొదటి, రెండో ప్రాధాన్యత ఓట్లతో ప్రధాన పార్టీల గెలుపోటములను తారుమారు చేశానని అశోక్ కుమార్ గుర్తు చేశారు. ఈసారి మాత్రం తన విజయం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రంలో 90 శాతానికి పైగా ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలను విస్మరించి రెండు ఎమ్మెల్సీ స్థానాలను ఓసీలకే కేటాయించడంపై అశోక్ ఆగ్రహం వ్యక్తం చేశారు. “ఓట్లు మావి.. సీట్లు మీవా?” అని ప్రశ్నించారు.
15 ఏళ్లుగా నిరుద్యోగుల కోసం పోరాటం..
కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చిన 42 శాతం బీసీ సబ్‌ప్లాన్ సమ్మేళనాన్ని గాలికొదిలేసిందని అశోక్ కుమార్ విమర్శించారు. స్థానిక అస్తిత్వం, ప్రజా సంబంధాలు లేని ధనవంతులను పార్టీలు బరిలోకి దించుతున్నాయని, ఈ ధోరణికి పట్టభద్రులు తమ ఓటు ద్వారా బుద్ధి చెప్పాలని కోరారు. 15 ఏళ్లుగా నిరుద్యోగుల హక్కుల కోసం పోరాడుతూ 18 కేసులు ఎదుర్కొన్నానని, అనేకసార్లు నిరాహార దీక్షలు చేశానని గుర్తు చేశారు. ఏడాదిలో 2 లక్షల ఉద్యోగాలని చెప్పి కేవలం 13 వేల ఉద్యోగాలు మాత్రమే ఇచ్చారని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీశారు. మెగా డీఎస్సీ, పవర్ సెక్టార్ ఉద్యోగాల నోటిఫికేషన్లు తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
నాన్ లోకల్ గో బ్యాక్ నినాదంతో..
ఉద్యోగులకు ఇవ్వాల్సిన పీఆర్సీ, పెండింగ్ ఆరు డీఏలను వెంటనే విడుదల చేయాలని అశోక్ కుమార్ డిమాండ్ చేశారు. అవుట్సోర్సింగ్ ఉద్యోగుల శ్రమ దోపిడీని అరికట్టాలని స్పష్టం చేశారు. హైదరాబాద్‌తో పాటు రాష్ట్రంలోని ఐటీ, పరిశ్రమలు, ఉద్యోగ అవకాశాలు 80 శాతం పొరుగు రాష్ట్రాల గుప్పెట్లో ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. శివసేన స్పూర్తితో ‘నాన్ లోకల్ గో బ్యాక్’ నినాదంతో ఉద్యమిస్తానని ప్రకటించారు. తెలంగాణ బిడ్డలకు ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో ఉపాధి కల్పించడమే తన ప్రధాన ఎజెండా అని స్పష్టం చేశారు. నాయకులు కె.వి.గౌడ్, ప్రణీత్, నవీన్ రెడ్డి, కిరణ్, రవి, కొండల్, మహేష్, సురేష్, సంధ్య, ఇందు పాల్గొన్నారు.

