కలం, నిర్మల్ : రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖలపై నిర్మల్ జిల్లా కలెక్టరేట్‌లొ నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ (MLA Vedma Bojju Patel) పాల్గొన్నారు. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఇన్చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో ఖానాపూర్ నియోజకవర్గ సమస్యలను మంత్రుల దృష్టికి తీసుకెళ్లారు.
నియోజకవర్గంలో 700కు పైగా మంజూరైన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు అటవీ శాఖ కోర్ ఏరియా పరిధిలో ఉన్నాయనే కారణంతో అనుమతులు లభించక లబ్ధిదారులు ఇబ్బందులు పడుతున్నారని ఎమ్మెల్యే తెలిపారు. ఎన్నో ఏళ్లుగా ఆయా ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజల ఇళ్ల నిర్మాణాలకు అటవీ శాఖ అభ్యంతరాలు అడ్డంకిగా మారుతున్నాయని పేర్కొన్నారు.
రెవెన్యూ, అటవీ శాఖల మధ్య సమన్వయంతో సమస్యను పరిష్కరించి, మంజూరైన ఇళ్ల నిర్మాణాలకు మార్గం సుగమం చేయాలని కోరారు. అలాగే కడెం మండలంలో రిసార్టుల పేరుతో జరుగుతున్న భూ ఆక్రమణల అంశాన్ని కూడా మంత్రుల దృష్టికి తీసుకెళ్లి, సమగ్రంగా పరిశీలించి చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఎమ్మెల్యే ప్రస్తావించిన అంశాలపై మంత్రులు సానుకూలంగా స్పందించి, సంబంధిత అధికారులతో సమీక్షించి పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

