కలం, వెబ్ డెస్క్ : తమిళనాడులో కొన్ని రోజులుగా కొనసాగుతున్న ఉత్కంఠకు తెరపడింది. రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి టీవీకే చీఫ్ విజయ్‌కు (TVK Chief Vijay) గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ ఆమోదం తెలిపారు. లోక్‌భవన్‌లో కొద్దిసేపటి క్రితం గవర్నర్ తో భేటీ అయి వివరణ ఇచ్చారు. ఈ క్రమంలో ప్రభుత్వ ఏర్పాటుకు అసెంబ్లీ వేదికగా బలం నిరూపించుకోవాలని గవర్నర్ సూచించారు. కాగా, దీనిపై కాసేపట్లో లోక్ భవన్ నుంచి అధికారికంగా ప్రకటన వెలువడనుంది. గవర్నర్‌తో భేటీ అనంతరం లోక్‌భవన్ నుంచి విజయ్ (TVK Chief Vijay) టీవీకే పార్టీ ఆఫీసుకు వెళ్లారు.
అలాగే, టీవీకే పార్టీకి విడుదలై చిరుత్తైగళ్ పార్టీ అధ్యక్షుడు తిరుమావలవన్ మద్దతు ఇచ్చేందుకు ముందుకొచ్చారు. కాగా, ఈ పార్టీకి ఇద్దరు ఎమ్మెల్యేలు ఉన్నారు. టీవీకే ప్రభుత్వ ఏర్పాటుపై గవర్నర్
ఇబ్బంది పెడితే సుప్రీంకోర్టుకు వెళ్లాలని విజయ్ నిర్ణయించుకున్నారు. ఇంతలోనే గవర్నర్ నుంచి సానుకూల స్పందన రావడంతో ప్రభుత్వ ఏర్పాటుపై కసరత్తు మొదలయింది. ప్రమాణ స్వీకారం తేదీ, సమయాన్ని ఈ రోజు సాయంత్రానికి టీవీకే చీఫ్ ప్రకటించే అవకాశం ఉంది.
అంతకుముందు.. అత్యధిక సీట్లు గెల్చుకున్న టీవీకే పార్టీని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ఆహ్వానించాలని గవర్నర్‌కు మాజీ సీఎం స్టాలిన్ సూచించారు. ప్రజాస్వామ్య స్ఫూర్తిని ప్రదర్శించడం మంచిదని కోరారు. ప్రజలు మద్దతు ఇచ్చినందున ఎక్కువ సీట్లు గెల్చుకున్న విజయ్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ఇబ్బందులు ఉండొద్దని ఆకాంక్షించారు. ఈ అన్ని పరిణామాల నేపథ్యంలో తమిళనాడు గవర్నర్ నుంచి సానుకూల స్పందన రావడం గమనార్హం.

