కలం, వెబ్ డెస్క్: పశ్చిమ బెంగాల్ (West Bengal)లో బీజేపీ ప్రభుత్వం కొలువుదీరినప్పటి నుంచి టీఎంసీ (TMC) నేతలపై చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి. కొందరిపై బహిరంగ దాడులు కూడా జరుగుతున్నాయి. తాజాగా కృష్ణానగర్‌లో పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి ఉజ్జల్ బిశ్వాస్ (Ujjal Biswas)ను పోలీసులు అరెస్ట్ చేశారు. వరద బాధితులకు పంపిణీ చేయాల్సిన టార్పాలిన్ వంటి సహాయక సామగ్రిని ఆయన అక్రమంగా తన ఇంట్లో నిల్వ చేసుకున్నారన్న ఆరోపణలపై ఆయనను అదుపులోకి తీసుకున్నారు.
ఈ నేపథ్యంలో ఆగ్రహించిన స్థానికులు, నిరసనకారులు ఆయన ఇంటిపై దాడికి పాల్పడ్డారు. కార్యాలయాన్ని ధ్వంసం చేయడమే కాకుండా, ఫైళ్లను రోడ్డుపైకి విసిరేశారు. కార్యాలయంలో కూర్చుని ఉన్న బిశ్వాస్‌పై (Ujjal Biswas) కోడిగుడ్లతో దాడి చేశారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ దాడితో బిశ్వాస్ ఇంట్లో తీవ్ర ఉద్రిక్తత నెలకొన్న తరుణంలో పోలీసులు రంగప్రవేశం చేసి ఆయనను అక్కడి నుండి తరలించారు.
ఈ దాడికి పాల్పడింది బీజేపీ మద్దతుదారులేనని బిశ్వాస్ కుటుంబ సభ్యులు ఆరోపించారు. అయితే ప్రజలకు పంచాల్సిన సహాయక సామగ్రిని ఆయన సొంతానికి వాడుకుంటున్నారని బీజేపీ నేతలు విమర్శిస్తున్నారు. మంత్రి కోటా కింద వచ్చిన ఈ సామగ్రిని అవసరమైనప్పుడు ప్రజలకు పంచడానికే ఇంట్లో భద్రపరిచామని కుటుంబ సభ్యులు వాదిస్తున్నారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో టీఎంసీ ఓటమి తర్వాత పశ్చిమ బెంగాల్‌లో ఆ పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులపై ఇలాంటి కోడిగుడ్ల దాడులు నిరంతరాయంగా సాగుతున్నాయి. గతంలో పశ్చిమ బెంగాల్ జైళ్ల శాఖ మంత్రిగా, కృష్ణానగర్ సౌత్ ఎమ్మెల్యేగా పనిచేసిన ఉజ్జల్ బిశ్వాస్ అరెస్ట్ ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర సంచలనంగా మారింది.
Read Also: ప్రధానిగా మోదీ రికార్డ్.. ఎన్డీఏ కూటమి ప్రత్యేక సమావేశం
Follow Us On: Sharechat

