కలం, ఖమ్మం బ్యూరో: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరులోని (Manuguru) గిరిజన ఆశ్రమ బాలికల పాఠశాలను(Tribal Girls Ashram School) పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు (MLA Payam) ఆదివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాఠశాల పరిసరాలు, హాస్టల్‌లో విద్యార్థినులకు అందుతున్న సౌకర్యాలను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా హాస్టల్‌లో తాగునీటి వసతి, మరుగుదొడ్ల నిర్వహణ, పారిశుధ్య పరిస్థితులను ఎమ్మెల్యే క్షుణ్ణంగా పరిశీలించారు.
అనంతరం విద్యార్థినులతో కలిసి భోజనం చేసి, ఆహార నాణ్యతను స్వయంగా పరిశీలించారు. ప్రతిరోజూ మెనూ ప్రకారం విద్యార్థినులకు భోజనం అందుతోందా లేదా అనే విషయాన్ని వారిని అడిగి తెలుసుకున్నారు. హాస్టల్‌లో ఎదురవుతున్న సమస్యలను విద్యార్థినులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకురాగా, వాటిని వెంటనే పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. గిరిజన విద్యార్థుల సంక్షేమం, వారికి నాణ్యమైన విద్యతో పాటు మెరుగైన పోషకాహారం అందించడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని తెలిపారు. విద్యార్థుల భవిష్యత్తు బాగుంటేనే సమాజం అభివృద్ధి చెందుతుందని పేర్కొన్నారు. ఆశ్రమ పాఠశాలలలో ఎలాంటి లోటుపాట్లు లేకుండా మౌలిక వసతులను మరింత మెరుగుపరుస్తామని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

