కలం, వెబ్‌డెస్క్: ఐపీఎల్ 2026 (IPL 2026) లో ముంబై ఇండియన్స్ (Mumbai Indians) పై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు సాధించిన ఉత్కంఠ విజయం ఒకవైపు సంతోషాన్ని నింపితే, మరోవైపు వివాదాన్ని రాజేసింది. ఆర్‌సీబీ బ్యాటర్ టిమ్ డేవిడ్ (Tim David) మైదానంలో చేసిన ఒక అనుచిత సైగ ఇప్పుడు తీవ్ర చర్చకు దారితీసింది. ముంబైపై గెలిచిన ఆనందంలో డేవిడ్ తన మధ్య వేలు చూపిస్తూ అసభ్యకరంగా ప్రవర్తించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
విజయం ఖాయమైన వెంటనే ఆర్‌సీబీ డగౌట్ సంబరాల్లో మునిగిపోయింది. ఆ సమయంలోనే టిమ్ డేవిడ్ ఈ వివాదాస్పద సైగ చేశాడు. గతంలో తనను వదులుకున్న ముంబై జట్టుపై కోపంతోనే ఇలా చేశాడా? లేక మరేదైనా కారణమా? అన్నది తెలియాల్సి ఉంది. కాగా ఈ అంశంపై ఐపీఎల్ యాజమాన్యం ఎలాంటి చర్యలు తీసుకుంటుంది అనేది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారంది.
ఈ మ్యాచ్‌లో ముంబై నిర్దేశించిన 167 పరుగుల లక్ష్యాన్ని ఆర్‌సీబీ చివరి బంతికి ఛేదించింది. ఒకప్పుడు ముంబై జట్టుకే ఆడిన టిమ్ డేవిడ్, ఈ మ్యాచ్‌లో మాత్రం మొదటి బంతికే డకౌట్ అయి నిరాశపరిచారు. అయినప్పటికీ, కృనాల్ పాండ్యా 73 పరుగుల వీరోచిత పోరాటం, చివరి ఓవర్‌లో భువనేశ్వర్ కుమార్ సిక్సర్, రసిక్ సలామ్ దార్ మెరుపులతో బెంగళూరు విజయం సాధించింది.

