కలం, ఖమ్మం బ్యూరో : భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో నూతనంగా ఏర్పడిన కొత్తగూడెం కార్పొరేషన్లో (Kothagudem Corporation) కాంగ్రెస్ పార్టీ బీ ఫామ్ కోసం రూ.30 లక్షలు వసూలు చేస్తున్నారంటూ సోషల్ మీడియా వేదికగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇదంతా జిల్లాలోని ఒక కీలక నేత అనుచరుల కనుసన్నల్లోనే జరుగుతున్నట్లుగా తెలుస్తోంది. కార్పొరేషన్లో 60 డివిజన్లు ఉండగా కాంగ్రెస్ పార్టీకి చెందినవారే దాదాపు 200 ల మంది నామినేషన్లు వేశారు. దీంతో విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. ఉపసంహరణ నాటికి పొత్తులు కుదిరితే సీట్లు ఇంకా తగ్గే అవకాశం ఉంది. పొత్తులు కుదరకపోయినా ఒక కౌన్సిలర్ స్థానానికి నలుగురు అభ్యర్ధులు పోటీ పడుతున్నారు.
దీన్ని అదునుగా భావించిన ఒక కీలక నేత అనుచరులు నామినేషన్ వేసిన వారికి ఫోన్ చేసి డబ్బులు డిమాండ్ చేస్తున్నారని, ఇవ్వకుంటే బీ ఫామ్ పై ఆశలు వదులుకోవాల్సి ఉంటుందని చెప్తున్నారంటూ సోషల్ మీడియాలో కొందరు పోస్ట్ లు పెడుతున్నారు. దీంతో జిల్లాలో కాంగ్రెస్ పై సీనియర్ నేతలు, కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కొత్తగూడెం జిల్లాలో ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలకు,కొత్తగా పార్టీలో చేరినవారికి పొసగడం లేదు. కొత్తగా చేరినవారికే గుర్తింపు ఉందంటూ పాత వారు అసహనంతో ఉన్నారు. కార్పొరేషన్ (Kothagudem Corporation) పదవులలో కూడా జిల్లాలోని సీనియర్లకు అన్యాయం జరిగిందంటూ ఆరోపణలు గతంలో వచ్చాయి.
మళ్ళీ ఇప్పుడు టిక్కెట్లు అమ్ముకుంటున్నారనే విషయం బయటికి రావడంతో నిబద్ధత గల కార్యకర్తల పరిస్థితి గందరగోళంగా తయారైంది. పార్టీ జెండా మోయనివారికి కూడా పిలిచి టిక్కెట్లు ఇస్తున్నారని తెలియడంతో, ఇన్ని సంవత్సరాలు కష్టపడి పని చేసిన వాళ్ళకు దక్కే మర్యాద ఇదేనా అని వారు ప్రశ్నిస్తున్నారు. పదేళ్ళు(2014- 2024)కాంగ్రెస్ అధికారంలో లేకపోయినా పార్టీ మారకుండా నిజాయితీ గా ఉంటూ జిల్లాలో పార్టీని కాపాడుకున్నామని వాపోతున్నారు. 2024 ఎన్నికల సమయంలో ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి ఎంతో మంది కీలక నాయకులు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవ్వడమే కాకుండా దాదాపు జిల్లాలో అన్ని స్థానాలు గెలిపించారు.
ఇంతవరకూ బాగానే ఉన్నా, ఎప్పటినుంచో పార్టీని నమ్ముకున్నవాళ్లను కూడా గుర్తించాలి కదా అనే బాధ పాత నేతల్లో కనిపిస్తుంది. జిల్లాలో చక్రం తిప్పుతున్న ఆ కీలక నేత అనుచరులు 30 లక్షలు వసూలు చేస్తూ దారుణానికి ఒడగొట్టడమే కాకుండా పార్టీని భ్రష్టుపట్టిస్తుంటే, సదరు కీలక నేత ఎందుకు మాట్లాడటం లేదనే ప్రశ్నలు ఉత్పన్నం అవుతున్నాయి. ఇప్పటికైనా సదరు నేత స్పందించి దిద్దుబాటు చర్యలు చేపట్టకపోతే సొంత వాళ్ళే పార్టీని ఓడించే అవకాశాలు కూడా లేకపోలేదు అని అసంతృప్తితో ఉన్నవారు చెప్తున్నారు.
Read Also: జూడ్కు గాయం.. రియల్ మ్యాడ్రిడ్కు భారీ ఎదురుదెబ్బ..
Follow Us On: Pinterest


