epaper
Monday, February 2, 2026
spot_img
epaper

పురపోరు.. అభ్యర్థులు ఎంత ఖర్చు పెట్టాలో తెలుసా..?

కలం, డెస్క్ : తెలంగాణలో 116 మున్సిపాలిటీలు, 7 మున్సిపల్ కార్పొరేషన్లకు ఎన్నికలు (Municipal Elections) జరుగుతున్నాయి. ప్రస్తుతం నామినేషన్ల ఉపసంహరణ కొనసాగుతోంది. రేపు అభ్యర్థుల ఫైనల్ లిస్ట్ రాబోతోంది. అయితే మున్సిపాలిటీల్లో ఎన్నికలకు ఎంత ఖర్చు పెట్టాలి, కార్పొరేషన్లలో ఎంత ఖర్చుపెట్టాలనేది అందరికీ అవగాహన ఉండకపోవచ్చు. పరిమితికి మించి ఖర్చు పెడితే అభ్యర్థి ఎన్నిక రద్దయ్యే ఛాన్స్ ఉంటుంది. భవిష్యత్తులో పోటీ చేయకుండా అనర్హత వేటు కూడా పడొచ్చు. మున్సిపాలిటీల్లోనూ గ్రేడ్లు ఉంటాయి. మీరు పోటీ చేస్తున్న మున్సిపాలిటీ ఏ గ్రేడ్ లోకి వస్తే.. అందుకు తగ్గట్టు ఖర్చుల లిమిట్ ఉంటుంది. మున్సిపల్ కార్పొరేషన్లలో ఖర్చులు కాస్త ఎక్కువగా ఉంటాయి. కానీ అక్కడ కూడా పరిమితి దాటితే వేటు తప్పదు. కాబట్టి ఎక్కడ ఎంత ఖర్చుపెట్టాలో ఒకసారి చూద్దాం.

మునిసిపాలిటీ రకం – ఖర్చు వివరాలు..

ఇక్కడ స్వతంత్ర అభ్యర్థి అయినా, పార్టీ గుర్తుపై పోటీ చేస్తున్న వారికైనా ఎన్నికల ఖర్చు పరిమితి ఒకే విధంగా ఉంటుంది. గ్రేడ్ -1 మున్సిపాలిటీలో పోటీ చేసే అభ్యర్థుల ఎన్నికల ఖర్చు రూ.5 లక్షలు దాటొద్దు. అలాగే గ్రేడ్ -2 మున్సిపాలిటీలో రూ.4లక్షలు, గ్రేడ్-3 లో పోటీ చేసే వారు రూ.3లక్షల దాకా ఖర్చు పెట్టుకోవచ్చు.

మున్సిపల్ కార్పొరేషన్ లో..

మున్సిపల్ కార్పొరేషన్లలో (Municipal Corporations) రూ.10 లక్షల దాకా ఖర్చు పెట్టుకోవచ్చు. పార్టీ నుంచి పోటీ చేస్తున్న వారికి, స్వతంత్ర అభ్యర్థులందరికీ ఇదే పరిమితి వర్తిస్తుంది.

లెక్కలోకి వచ్చే ఖర్చులు..

అభ్యర్థుల ఖర్చుల్లో ఫ్లెక్సీలు, బ్యానర్లు, పోస్టర్లు, ప్రచార పత్రాలు, వెహికల్స్ రెంట్, మైకులు, డీజేలు, సభలు, సమావేశాలు, కార్యకర్తలకు భోజనం, నీళ్లతో పాటు పార్టీ సదరు డివిజన్ లో పెట్టిన ఖర్చును కూడా అభ్యర్థి ఖర్చుగానే చూస్తారు. ఒకవేళ అభ్యర్థి ఏదైనా ఫంక్షన్ లేదా అంత్యక్రియల దగ్గర ప్రచారం కోసం పెట్టే ఖర్చులను కూడా ఎన్నికల ఖర్చు కిందే లెక్కిస్తారు.

లెక్కలోకి రాని ఖర్చులు..

అభ్యర్థి సొంత ఖర్చులను ఎన్నికల ఖర్చుగా చూడరు. ఉదాహరణకు.. ఇంటి రెంట్, తిండి, కరెంట్ బిల్లులు, సొంత అవసరాల కోసం పెట్టుకునేవి లెక్కించరు. అదే విధంగా పార్టీ ఆఫీస్ స్టాఫ్‌ జీతాలు, ఆఫీస్ అద్దె లాంటివి కూడా ఎన్నికల ఖర్చు కిందకు రావు.

ఖర్చుల రిజిస్టర్ తప్పనిసరి..

ప్రతి అభ్యర్థి తప్పనిసరిగా ఖర్చుల రిజిస్టర్ ను మెయింటేన్ చేయాలి. ప్రచారం కోసం ఖర్చు చేస్తున్న ప్రతి రూపాయిని అందులో రాయాల్సిందే. ఎన్నికల అధికారికి ప్రచారం మధ్యలో, ఎన్నిక పూర్తయిన 30 రోజుల్లోపు రిజిస్టర్ ను తప్పకుండా చూపించాలి. ఒకవేళ ఇన్ టైమ్ లో చూపించకపోతే మీ మీద అనర్హత వేటు పడే ఛాన్స్ ఉంది.

ఎన్నికల ఖర్చు పరిమితి మించితే ఏమవుతుంది..?

ఎన్నికల (Municipal Elections) ఖర్చు విషయంలో అభ్యర్థులు చాలా జాగ్రత్తగా ఉండాలి. పరిమితికి మించి ఖర్చు పెడితే మీరు గెలిచిన తర్వాత కూడా మీ ఎన్నిక రద్దవుతుంది. మీ మీద అనర్హత వేటు పడుతుంది. భవిష్యత్ లో మళ్లీ పోటీ చేయకుండా నిషేధం విధించే ఛాన్స్ కూడా ఉంది.

బ్యాంకు ఖాతా ద్వారానే..

ఎన్నికల సంఘం తీసుకొచ్చిన కొత్త రూల్ ప్రకారం.. పోటీ చేస్తున్న అభ్యర్థులు నామినేషన్ వేయడానికి ముందే ఒక బ్యాంకు ఖాతా తెరవాలి. ఆ ఖాతా నుంచే ప్రతి రూపాయి ఎన్నికల కోసం ఖర్చు చేయాలి. ఎన్నికలు అయిపోయిన తర్వాత అభ్యర్థులు ఈ బ్యాంకు ఖాతా స్టేట్ మెంట్ ఆధారంగా ఎన్నికల అధికారులకు ఖర్చు వివరాలను సమర్పించాలి. ఈ బ్యాంకు ఖాతా నుంచి పరిమితికి మించి ఖర్చు చేసినట్టు తేలినా.. లేదంటే ఇన్ టైమ్ లో ఎన్నికల అధికారికి సమర్పించకపోయినా వేటు పడుతుంది.

Read Also: ముప్పై లక్షలు కొట్టు.. బీ ఫామ్ పట్టు

Follow Us On: Sharechat

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>