కలం, వెబ్ డె్స్క్ : చైనా (China)కు చెందిన ప్రైవేట్ అంతరిక్ష పరిశోధన సంస్థ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన తియాన్‌లాంగ్-3 రాకెట్ ప్రయోగం ఘోరంగా విఫలమైంది. డాంగ్‌ఫెంగ్ కమర్షియల్ ఏరోస్పేస్ ఇన్నోవేషన్ కేంద్రం నుంచి ప్రయోగించిన ఈ భారీ రాకెట్, సాంకేతిక లోపం కారణంగా నింగిలోకి దూసుకెళ్లిన కొద్ది నిమిషాల్లోనే కుప్పకూలిపోయింది. అత్యంత శక్తిమంతమైనదిగా భావించిన ఈ రాకెట్ ప్రయోగం విఫలం కావడంతో, అంతర్జాతీయ వాణిజ్య అంతరిక్ష మార్కెట్లో పట్టు సాధించాలనుకున్న చైనా (China) ప్రయత్నాలకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ప్రైవేటు రంగంలో చేపట్టిన ఈ ప్రయోగం విఫలం కావడం అటు శాస్త్రవేత్తలను, ఇటు వాణిజ్య భాగస్వాములను తీవ్ర నిరాశకు గురిచేసింది. రాకెట్ గమనాన్ని నియంత్రించే వ్యవస్థలో తలెత్తిన లోపమే ఈ ప్రమాదానికి కారణమని ప్రాథమికంగా భావిస్తున్నారు. ఈ ఘటనపై పూర్తిస్థాయి విచారణకు ఆదేశించిన చైనా అధికారులు, భవిష్యత్ ప్రయోగాల్లో ఇటువంటి లోపాలు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకుంటామని ప్రకటించారు.

