కలం, వెబ్ డెస్క్ : తనపై క్షుద్ర పూజలు చేశారంటూ ఆరోపణలు చేసిన టీపీసీసీ అధ్యక్షుడు బి. మహేశ్ కుమార్ గౌడ్, ప్రభుత్వ విప్ అద్దంకి దయాకర్‌లపై బీఆర్‌ఎస్ సీనియర్ నేత, మాజీ మంత్రి తన్నీరు హరీశ్ రావు (Harish Rao) చర్యలకు దిగారు. బాధ్యతాయుతమైన పదవుల్లో ఉండి, ఆధారాలు లేకుండా తప్పుడు ఆరోపణలు చేసినందుకు వారిద్దరిపై నాంపల్లి ప్రజాప్రతినిధుల కోర్టులో పరువు నష్టం దావా దాఖలు చేసినట్లు హరీశ్ రావు తెలిపారు.
డైవర్షన్ రాజకీయాలకే ఈ డ్రామాలు
కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన ఆరు గ్యారెంటీలు, హామీల అమలుపై తాము ప్రజల తరఫున నిలదీస్తుంటే, సమాధానం చెప్పలేక కాంగ్రెస్ నాయకులు డైవర్షన్ రాజకీయాలకు పాల్పడుతున్నారని హరీశ్ రావు ఆరోపించారు . ప్రజల దృష్టిని మళ్లించేందుకే తన కుటుంబ సమేత ఆధ్యాత్మిక దేవాలయ దర్శనాలను విపరీతంగా చిత్రీకరిస్తూ, క్షుద్ర పూజలంటూ దిగజారుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.
అసత్య ప్రచారాలు చేస్తే వదిలిపెట్టం!
గతంలోనే లీగల్ నోటీసులు పంపినప్పటికీ కాంగ్రెస్ నేతలు బహిరంగ క్షమాపణలు చెప్పకపోవడంతోనే కోర్టును ఆశ్రయించాల్సి వచ్చిందని హరీశ్ రావు పేర్కొన్నారు. చట్టంపై, న్యాయస్థానాలపై తనకు పూర్తి నమ్మకం ఉందన్నారు. తనను వ్యక్తిగతంగా, రాజకీయంగా దెబ్బతీయాలని చూస్తే ఊరుకోనని.. భవిష్యత్తులోనూ ఎవడైనా తనపై ఆధారాల్లేని అసత్య ప్రచారాలు చేస్తే చట్టపరంగా వదిలిపెట్టే ప్రసక్తే లేదని హెచ్చరించారు. గత కొంతకాలంగా హాట్ టాపిక్ గా మారిన క్షుద్ర పూజల వ్యవహారం ఇప్పుడు కోర్టు ప్రాంగణంలోకి వెళ్లింది. మరి ఈ వ్యవహారంపై కోర్టు ఎలాంటి తీర్పును ఇస్తుందోననే ఉత్కంఠ రాజకీయా వర్గాల్లో నెలకొంది.

