కలం, మిర్యాలగూడ: నల్లగొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలో అర్ధరాత్రి వేళ ఘోర విషాద ఘటన చోటుచేసుకుంది. ఓ ఇంట్లో గ్యాస్ సిలిండర్ భారీ శబ్దంతో పేలడంతో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు వ్యక్తులు నిద్రలోనే సజీవదహనమయ్యారు. అర్ధరాత్రి దాటిన తర్వాత ఒక్కసారిగా సంభవించిన విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా ఇంట్లో మంటలు చెలరేగాయి. ఈ మంటలు కాస్తా ఇంట్లో ఉన్న గ్యాస్ సిలిండర్‌కు అంటుకోవడంతో అది భారీ శబ్దంతో పేలిపోయింది. క్షణాల వ్యవధిలో మంటలు ఇల్లంతా వ్యాపించాయి. ఈ ప్రమాదంలో ఇంట్లో నిద్రిస్తున్న అమ్మమ్మ చంద్రమ్మ, ఆమె మనవడు లక్ష్మణ్ (17), మనవరాలు ప్రణతి (14) మంటల్లో చిక్కుకుని అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మృతుల తల్లిదండ్రులు ఉపాధి నిమిత్తం పూణే, హైదరాబాద్ ప్రాంతాల్లో ఉంటుండటంతో, పిల్లలిద్దరూ ఇక్కడే అమ్మమ్మ వద్ద ఉంటూ చదువుకుంటున్నారు.
ఇటీవలె చంద్రమ్మ భర్త కూడా మరణించారని, అంతలోనే ఈ ఘోర ప్రమాదం జరగడం గమనార్హం. భారీ పేలుడు శబ్దం రావడంతో స్థానికులు ఉలిక్కిపడి లేచారు. ఇల్లు తగలబడుతుండటం గమనించి వెంటనే నీళ్లు చల్లుతూ మంటలను అదుపు చేసే ప్రయత్నం చేశారు. అనంతరం పోలీసులకు, అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. అయితే ఫైర్ ఇంజిన్ ఘటనా స్థలానికి చేరుకునే లోపే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ముగ్గురి శరీరాలు పూర్తిగా కాలి బూడిదయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం మిర్యాలగూడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. నిన్నటి వరకు కళ్లముందే తిరిగిన పిల్లలు, వృద్ధురాలు నిద్రలోనే ప్రాణాలు విడవడం స్థానికులను తీవ్రంగా కలచివేసింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు.

