కలం, వెబ్ డెస్క్ : ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth) పర్యటన రెండో రోజు అత్యంత కీలకంగా సాగనుంది. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి సంబంధించిన పనులను స్వయంగా పర్యవేక్షించేందుకు సీఎం ఈరోజు క్షేత్రస్థాయిలో విస్తృతంగా పర్యటించనున్నారు. ఉదయం 10.30 గంటలకు నాగర్‌కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మండలంలోని ఎల్లూరు పంప్‌హౌస్‌కు చేరుకోవడంతో ఆయన పర్యటన ప్రారంభమవుతుంది. అక్కడ పీఆర్‌ఎల్‌ఐఎస్ ప్యాకేజీ-3 హెడ్ రెగ్యులేటర్, ప్యాకేజీ-2 నార్లాపూర్ రిజర్వాయర్, ప్యాకేజీ-1 డెలివరీ సిస్టర్న్ తో పాటు ఎంజీకేఎల్‌ఐఎస్ లిఫ్ట్-1 పంప్‌హౌస్‌లను ఆయన క్షుణ్ణంగా పరిశీలిస్తారు.
ఆ తర్వాత ఉదయం 11.50 గంటలకు పీఆర్‌ఎల్‌ఐఎస్ ప్యాకేజీ-3 కాలువ పనులు, ఏదుల రిజర్వాయర్, పంప్‌హౌస్ పనులను సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth) ఏరియల్ వ్యూ ద్వారా పరిశీలిస్తారు. మధ్యాహ్నం 12.30 గంటల సమయానికి కుమ్మెర చేరుకుని, అక్కడ పీఆర్‌ఎల్‌ఐఎస్ ప్యాకేజీ-8 స్టేజ్-3 పంప్‌హౌస్ తో పాటు వట్టెం రిజర్వాయర్‌కు సంబంధించిన ప్యాకేజీలు 9, 10, 11 పనుల ప్రగతిని అంచనా వేస్తారు. మధ్యాహ్నం 2 గంటలకు మహబూబ్‌నగర్ జిల్లా భూత్పూర్ మండలం కొత్తూర్ పరిధిలోని కరివేన రిజర్వాయర్ ప్యాకేజీ- 14, 15 పనులను పరిశీలించిన అనంతరం, మధ్యాహ్నం 3.30 గంటలకు అక్కడే ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడతారు.
పర్యటన ముగింపు దశలో భాగంగా సాయంత్రం 5 గంటలకు జడ్చర్ల మండలం ఉద్దండాపూర్ లోని పీఆర్‌ఎల్‌ఐఎస్ రిజర్వాయర్ ప్యాకేజీలు 17, 18 పనులను సీఎం పర్యవేక్షిస్తారు. చివరగా సాయంత్రం 6.30 గంటలకు జడ్చర్లలో భారీ ఎత్తున ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొని ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. సీఎం పర్యటన నేపథ్యంలో ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.

