Mobile Popup Ad
Mobile Popup Ad

మూడో డిస్కం వద్దు.. ఖమ్మంలో రైతు సంఘాల హెచ్చరిక

కలం, ఖమ్మం బ్యూరో: కేంద్ర ప్రభుత్వ ప్రజావ్యతిరేక నిర్ణయాలకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం జీవో 44 ద్వారా మూడో విద్యుత్ పంపిణీ సంస్థ (రైతు డిస్కం) ఏర్పాటు చేయడంపై తెలంగాణ రైతు సంఘం ఖమ్మం జిల్లా కార్యదర్శి బొంతు రాంబాబు, జిల్లా సీనియర్ నాయకులు తాతా భాస్కరరావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఉచిత విద్యుత్ విధానానికి మంగళం పాడేందుకు కుట్ర చేస్తోందని మండిపడ్డారు. శనివారం ఖమ్మం (Khammam) జిల్లా, తల్లాడ మండలం కుర్ణవల్లిలో తెలంగాణ రైతు సంఘం మండల కమిటీ ఆధ్వర్యంలో రైతు సదస్సు నిర్వహించారు. రైతు సంఘం సత్తుపల్లి డివిజన్ అధ్యక్షులు నల్లమోతు మోహన్‌రావు అధ్యక్షతన జరిగిన ఈ సదస్సులో నాయకులు ముఖ్య అతిథులుగా పాల్గొని ప్రసంగించారు.

​ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. వ్యవసాయ రంగాన్ని, ఉచిత విద్యుత్ వ్యవస్థను నిర్వీర్యం చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం అడుగులు వేస్తోందని ఆరోపించారు. కొత్తగా ఏర్పాటు చేయ తలపెట్టిన మూడో డిస్కం పరిధిలోకి వ్యవసాయ విద్యుత్‌తో పాటు ఇతర అన్ని రకాల సబ్సిడీ విద్యుత్ సరఫరా విభాగాలను చేర్చుతున్నారని తెలిపారు. భవిష్యత్తులో ఉచిత విద్యుత్ సరఫరా భారం అవుతుందనే వంకతో, దీనిని పూర్తిగా ఎత్తివేసేందుకే ఈ తరహా ప్రచారాలకు తెరలేపుతున్నారని మండిపడ్డారు.

​వ్యవసాయ విద్యుత్ డిస్ట్రిబ్యూషన్, ట్రాన్స్‌ఫార్మర్లకు స్మార్ట్ మీటర్లు అమర్చడమే ఈ మూడో డిస్కం యొక్క ప్రధాన ఉద్దేశమని నాయకులు స్పష్టం చేశారు. ఈ విధానం వల్ల భవిష్యత్తులో ఉచిత విద్యుత్ పొందే వ్యవసాయ మోటార్లు, ఎత్తిపోతల పథకాలు, మిషన్ భగీరథతో పాటు రాయితీపై విద్యుత్ పొందుతున్న ప్రతి సంస్థ, సాధారణ వ్యక్తులు తీవ్రంగా నష్టపోతారని ఆందోళన వ్యక్తం చేశారు. వ్యవసాయానికి ముసురుకుంటున్న ఈ విద్యుత్ సంస్కరణలకు వ్యతిరేకంగా రైతాంగం పెద్ద ఎత్తున ఉద్యమ బాట పట్టాలని పిలుపునిచ్చారు.

అలాగే ​కేంద్ర ప్రభుత్వం నిరంతరాయంగా పెంచుతున్న ఎరువులు, పెట్రోల్, డీజిల్ ధరల వల్ల పెట్టుబడి వ్యయం పెరిగి వ్యవసాయ రంగం తీవ్ర సంక్షోభంలో కూరుకుపోతోందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో పెండింగ్‌లో ఉన్న భూసమస్యల పరిష్కారం కోసం రైతులంతా ఏకమై రాబోయే ఉద్యమాల్లో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ​ఈ సదస్సులో తెలంగాణ రైతు సంఘం మండల, గ్రామ కమిటీ ప్రతినిధులు, స్థానిక రైతులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>