కలం, వెబ్‌డెస్క్: ఊపిరి సలపనంత వేగం.. సునామీ లాంటి ఎనర్జీ.. క్షణక్షణానికి మారే వ్యూహాలతో అభిమానులను పిచ్చెక్కించే ‘ది బ్యూటిఫుల్ గేమ్ ఫుట్‌బాల్’(Football)..! ప్రస్తుతం ఫిఫా ఫీవర్ ప్రపంచాన్ని ఉర్రూతలూగిస్తున్నది. చాలామందికి ఫుట్‌బాల్ అంటే కేవలం గోల్స్ కొట్టడమే తెలుసు. కానీ, 90 నిమిషాల మ్యాచ్‌లో ఒక్కో ప్లేయర్ ఏకంగా 10 నుంచి 13 కిలోమీటర్లు పరిగెడతారనే మైండ్ బ్లోయింగ్ నిజం ఎంతమందికి తెలుసు? మ్యాచ్ గమనాన్ని శాసించే ‘ఆఫ్‌సైడ్’ చక్రవ్యూహం, తప్పులను సెకన్లలో నిగ్గుతేల్చే హై-టెక్ ‘వీఏఆర్’ టెక్నాలజీ, మైదానంలో క్రమశిక్షణను శాసించే రెడ్, ఎల్లో కార్డ్స్.. ఇలా ప్రతి సెకనూ నరాలు తెగే ఉత్కంఠను రేకెత్తించే ఆ సిసలైన ఫుట్‌బాల్ మజా ఏంటో చూద్దాం.. రండి!
ప్రపంచవ్యాప్తంగా అత్యంత ఆదరణ ఉన్న ఫుట్‌బాల్ ఆటలో ప్రతి మ్యాచ్ ఒక మహా యుద్ధాన్ని తలపిస్తుంది. ఈ ఆట మొత్తం 90 నిమిషాల పాటు సాగుతుంది. 45 నిమిషాల చొప్పున ఆటను రెండు హాఫ్లుగా విభజిస్తారు. మధ్యలో 15 నిమిషాల విరామం (హాఫ్ టైమ్) ఉంటుంది. క్రికెట్‌లా గంటల తరబడి కాకుండా, కేవలం గంటన్నరలోనే గెలుపోటములు తేలిపోతాయి కాబట్టి ఆటలో వేగం ఊహించని స్థాయిలో ఉంటుంది. నిర్ణీత సమయంలో గోల్ పోస్ట్‌లోకి అత్యధిక గోల్స్ చేసిన జట్టే విజేతగా నిలుస్తుంది. ఒకవేళ రెండు జట్లు సమాన సంఖ్యలో గోల్స్ చేస్తే అదనంగా మరో 30 నిమిషాల ‘ఎక్స్ట్రా టైమ్’ ఇస్తారు. అప్పటికీ విజేత తేలకపోతే ‘పెనాల్టీ షూటౌట్’ ద్వారా విజేతను నిర్ణయిస్తారు.
చెస్‌ను తలపించే పొజిషన్స్
మైదానంలో ప్రతి ఆటగాడికి ఒక ప్రత్యేక బాధ్యత ఉంటుంది. చేతులతో బంతిని తాకడానికి అనుమతి ఉండే ఏకైక ఆటగాడు ‘గోల్ కీపర్’. ఇతను ప్రత్యర్థి జట్టు గోల్స్ చేయకుండా అడ్డుకుంటాడు. గోల్ కీపర్‌కు ముందుండి రక్షణ వలయాన్ని నిర్మించే వారిని ‘డిఫెండర్లు’ అంటారు. మైదానం మధ్యలో ఉంటూ ఆటను నియంత్రిస్తూ, ఫార్వర్డ్ ఆటగాళ్లకు బంతిని అందించే వారిని ‘మిడ్‌ఫీల్డర్లు’ అంటారు. ఇక ప్రత్యర్థి రక్షణ వలయాన్ని ఛేదిస్తూ గోల్స్ చేయడమే లక్ష్యంగా దూసుకెళ్లే వ్యూహాత్మక ఆటగాళ్లను ‘స్ట్రైకర్లు’ లేదా ‘ఫార్వర్డ్లు’ అంటారు. ఎంతో మంది ఫుట్‌బాల్ అభిమానుల గుండెలను గెలుచుకున్న మెస్సీ, రొనాల్డో, ఎంబాపె లాంటి గ్లోబల్ ఐకాన్స్ ఈ స్థానంలో ఆడే స్ట్రైకర్లే.
ప్రధాన నియమాలు, ఫౌల్స్..
ఈ ఆటలో గోల్ కీపర్ మినహా మిగిలిన 10 మంది ఆటగాళ్లు బంతిని చేతులతో తాకకూడదు. ఒకవేళ తాకితే అది ‘ఫౌల్’. ఆటగాళ్లు కేవలం కాళ్లు, ఛాతీ, లేదా తలతో మాత్రమే బంతిని నియంత్రించాలి. ప్రత్యర్థి ఆటగాడిని వెనుక నుంచి నెట్టడం, కాలితో తన్నడం లేదా కావాలని కిందపడేయడం వంటివి చేస్తే రిఫరీ ఫౌల్ ఇస్తారు. ఫౌల్ తీవ్రతను బట్టి రిఫరీ ప్లేయర్లకు ‘ఎల్లో కార్డ్ (హెచ్చరిక) లేదా ‘రెడ్ కార్డ్’ (ఆట నుంచి బహిష్కరణ) జారీ చేస్తారు. ఒక మ్యాట్‌లో రెండు ఎల్లో కార్డులు వస్తే అది రెడ్ కార్డ్‌తో సమానం. రెడ్ కార్డ్ వచ్చిన ప్లేయర్ స్థానంలో వేరే ప్లేయర్‌ను లోపలికి రానివ్వరు. అంటే ఆ జట్టు కేవలం 10 మందితోనే మిగిలిన మ్యాచ్ ఆడాలి. ఇది ప్రత్యర్థికి భారీ ప్లస్ పాయింట్ అవుతుంది.
బంతి గీత దాటితే ఇది లెక్క..!
ఆట మధ్యలో బంతి గీత దాటి బయటకు వెళ్తే దానిని ‘డెడ్ బాల్’ అంటారు. ఈ సమయంలో మ్యాచ్‌ను మళ్లీ ప్రారంభించే ‘సెట్ పీసెస్’ ఆట గమనాన్నే మార్చేస్తాయి.
త్రో-ఇన్: బంతి సైడ్‌లైన్ దాటితే, ప్రత్యర్థి జట్టు ప్లేయర్ రెండు చేతులతో బంతిని తల వెనుక నుంచి మైదానంలోకి విసరాలి.
కార్నర్ కిక్: డిఫెండింగ్ జట్టు ఆటగాడికి బంతి తగిలి వారి సొంత గోల్ లైన్ దాటితే, దాడి చేస్తున్న జట్టుకు మైదానం మూల (కార్నర్ ఫ్లాగ్) నుంచి కిక్ కొట్టే అవకాశం వస్తుంది. ఇక్కడే వ్యూహాత్మకంగా హెడర్ల ద్వారా ఎక్కువ గోల్స్ నమోదవుతాయి.
పెనాల్టీ కిక్: గోల్ బాక్స్ (పెనాల్టీ ఏరియా) లోపల డిఫెండర్లు ఫౌల్ చేస్తే ప్రత్యర్థికి లభించే బంపర్ ఆఫర్ ఇది. కేవలం గోల్ కీపర్, స్ట్రైకర్ మాత్రమే ముఖాముఖి తలపడతారు. 99 శాతం ఇది గోల్‌గా మారుతుంది.
కన్ఫ్యూజ్ చేసే ‘ఆఫ్‌సైడ్’ రూల్
ఫుట్‌బాల్ అత్యంత గందరగోళానికి గురిచేసే, అత్యంత తెలివైన రూల్ ‘ఆఫ్‌సైడ్’. దాడి చేసే జట్టు ఆటగాడు, ప్రత్యర్థి జట్టు చివరి డిఫెండర్ కంటే ముందే (గోల్ పోస్ట్‌కు అత్యంత దగ్గరగా) నిలబడి పాస్ అందుకోకూడదు. స్ట్రైకర్లు గోల్ పోస్ట్ ముందే నిలబడి సులువుగా గోల్స్ కొట్టకుండా ఉండేందుకు పెట్టిన రూల్ ఇది. డిఫెండర్లు ఒక్కసారిగా ముందుకు జరిగి స్ట్రైకర్‌ను ‘ఆఫ్‌సైడ్ ట్రాప్’లో పడేసే మైండ్ గేమ్ ఇక్కడ అద్భుతంగా పండుతుంది.
వీఏఆర్ టెక్నాలజీ..
మైదానంలో రిఫరీ కంటికి చిక్కని తప్పులను సెకన్లలో నిగ్గుతేల్చే హై-టెక్ విప్లవమే ‘వీడియో అసిస్టెంట్ రిఫరీ (వీఏఆర్). గోల్స్, పెనాల్టీలు, రెడ్ కార్డ్స్ వంటి వివాదాస్పద నిర్ణయాల సమయంలో.. ప్రత్యేక గదిలోని అసిస్టెంట్ రిఫరీలు మల్టిపుల్ కెమెరా యాంగిల్స్, స్లో-మోషన్ విజువల్స్‌ను పరిశీలిస్తారు. మైదానంలోని మెయిన్ రిఫరీ వీళ్లతో మాట్లాడి లేదా తానే స్క్రీన్‌పై విజువల్స్ చూసి ఫైనల్ డెసిషన్ ప్రకటిస్తారు.
క్లైమాక్స్ సస్పెన్స్ ‘పెనాల్టీ షూటౌట్’
ఎక్స్ట్రా టైమ్ తర్వాత కూడా ఇరుజట్ల స్కోర్లు సమమైతే, విజేతను తేల్చడానికి ఫుట్ బాల్లోనే అత్యంత ఉత్కంఠభరితమైన ‘పెనాల్టీ షూటౌట్’ నిర్వహిస్తారు. ఇరు జట్ల నుంచి ఐదుగురు వేర్వేరు ఆటగాళ్లు మార్చి మార్చి కిక్స్ కొడతారు. ఎవరైతే ఎక్కువ గోల్స్ సాధిస్తారో వారే విజేతలు.
సడన్ డెత్: ఒకవేళ ఈ 5 కిక్స్ తర్వాత కూడా స్కోర్లు టై అయితే ‘సడన్ డెత్’ పద్ధతిని పాటిస్తారు. ఇందులో ఇరు జట్లు ఒక్కొక్క కిక్ చొప్పున కొడుతూ వెళ్తాయి. ఒకరు గోల్ కొట్టి ప్రత్యర్థి మిస్ చేసిన మరుక్షణమే మ్యాచ్ ముగుస్తుంది. ఎంతటి దిగ్గజ ఆటగాడైనా ఈ షూటౌట్ ఒత్తిడికి తలవంచాల్సిందే!
అందుకే ఫుట్‌బాల్ నంబర్ వన్..
ఫుట్‌బాల్ ఆటగాళ్లది సాధారణ ఫిట్నెస్ కాదు. ఒక్కో ప్లేయర్ 10 నుంచి13 కిలోమీటర్లు పరిగెత్తడం వెనుక కఠినమైన టెక్నికల్ సైన్స్, ‘హై-ఇంటెన్సిటీ ఇంటర్వెల్ ట్రైనింగ్’ చేస్తారు. నిరంతర స్ప్రింట్లు (మెరుపు వేగంతో పరుగెత్తడం), జిగ్‌జాగ్ కదలికల వల్ల ఆటగాళ్ల గుండె కొట్టుకునే వేగం గరిష్ట స్థాయికి చేరుకుని, లీటర్ల కొద్దీ చెమట కారిపోతుంది. ఈ అసాధారణ స్టామినా, మైండ్ గేమ్‌ల కలయిక వల్లే ఫుట్‌బాల్ ప్రపంచంలోనే నంబర్ వన్ ఆటగా నిలిచింది.

