కలం, వెబ్‌డెస్క్: వరుస ఎన్‌కౌంటర్లు, లొంగుబాట్లతో క్రమంగా క్షీణిస్తున్న మావోయిస్టు పార్టీ (Maoist Party) తాజాగా ఓ సంచలన ప్రకటన విడుదల చేసింది. దేశంలో ప్రస్తుతం మనువాద, ఫాసిస్టు పాలన కొనసాగుతోందని.. ఆ పాలనను అందరూ వ్యతిరేకించాలని మావోయిస్టు పార్టీ కోరింది. ఈ మేరకు మావోయిస్టు పార్టీ తెలంగాణ అధికార ప్రతినిధి జగన్ పేరిట ఆదివారం ఓ లేఖను విడుదల చేసింది. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ కేవలం పెట్టుబడిదారులకు మేలు చేస్తోందని పేర్కొన్నది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అప్పుల్లో కూరుకుపోతుంటే పెట్టుబడిదారుల సంపద మాత్రం పెరిగిపోతున్నదని మావోయిస్టు పార్టీ పేర్కొన్నది. వికసిత్ భారత్ పేరుతో దేశ సంపద దోచుకుంటున్న ఎన్డీయే ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజలు పోరాడాలని పిలుపునిచ్చింది. తెలంగాణ రాష్ట్రంలో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని.. ప్రభుత్వం చెప్పిన ధరకు పత్తిని కొనుగోలు చేయడం లేదని మావోయిస్టు పార్టీ ఆరోపించింది.
‘నవంబర్ 28, 29, 30 తేదీల్లో రాయపూర్ పట్నంలో డీజీపీల, పారామిలటరీ దళాల అధిపతుల, ఇంటెలిజెన్స్ విభాగాల సమావేశం జరిగింది. వికసిత్ భారత్ నిర్మాణానికి అడ్డంకులు లేకుండా చూడాలని ఈ సమావేశంలో పిలుపునిచ్చారు. గత పన్నెండేళ్లుగా మనువాదుల పాలన సాగుతోంది. అమృత్ కాల్, ఆత్మనిర్బర్ భారత్, నయా భారత్, శేష్ట భారత్, ఏక్ భారత్ , వికసిత్ భారత్ అంటూ ఎల్‌పీజీ పాలసీలకు అనుకూలమైన పేర్లు పెట్టి గోబెల్స్ ప్రచారం చేస్తున్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీయే ప్రభుత్వం, బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఆర్ఎస్ఎస్ అనుకూల విధానాలను అమలు చేస్తున్నారు.’ అంటూ మావోయిస్టు పార్టీ (Maoist Party) మండిపడింది.
ఎన్నికల ఫలితాలపై కూడా మావోయిస్టు పార్టీ అనుమానం వ్యక్తం చేసింది. ప్రజల అభిప్రాయానికి భిన్నంగా ఎన్నికల ఫలితాలు వస్తున్నాయని అభిప్రాయపడింది. ఎన్నికల సంఘం, సీబీఐ, ఎన్ఐఏ, ఈడీ, సెబీ, యూజీసీ, విజిలెన్స్ కమిషన్ , కాగ్ వంటి సంస్థలు బీజేపీ నియంత్రణలోకి వెళ్లిపోయాయయని మావోయిస్టు పార్టీ విమర్శించింది. తర్వలో 130వ రాజ్యాంగ సవరణ ద్వారా ప్రతిపక్షాల ముఖ్యమంత్రులను మంత్రులను తొలగించే కార్యక్రం కూడా చేయొచ్చని అభిప్రాయపడింది. బీఆర్ఎస్‌లో ఎస్ఐఆర్ ప్రక్రియ నిర్వహించడం వల్లే ఎన్డీయే గెలుపొందింది. హర్యానా, మహరాష్ట్రలో ఎస్ఐఆర్ ప్రక్రియ జరపకుండా ఉంటే బీజేపీ గెలవలేకపోయేదని మావోయిస్టు పార్టీ అభిప్రాయపడింది.
‘బీహార్ ఎన్నికల తర్వాత శ్రమ శక్తి నీతి 2025 పేరుతో నాలుగు కార్మిక కోడ్లను అమల్లోకి తీసుకొచ్చారు. చౌకగా శ్రమను దోచుకోవడం, పనిగంటలు పెంచడం, చట్టబద్ధ హక్కులను రద్దు చేయడం, సమ్మె హక్కును లేకుండా చేయడం వంటి ప్రమాదకర నిర్ణయాలు ఉన్నాయి. వీటితో కార్మికులు తీవ్రంగా నష్టపోతారు’ అని పార్టీ తన ప్రకటనలో పేర్కొన్నది. కేంద్ర ప్రభుత్వం కార్మిక వ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటోంది. ఇది రాజ్యాంగంలోకి 14, 16, 23 ఆర్టికల్స్ ను ఉల్లంఘించడమే. ఈ విధంగా సుమారు 50 కోట్లుగా ఉన్న సంఘటిత, అసంఘటిత కార్మిక వర్గం మీద దాడి చేయడమే అవుతోంది.’ అంటూ మావోయిస్టు పార్టీ తన లేఖలో ఆరోపించింది.
‘ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంటరీ సమావేశాల్లో అణుశక్తి వినియోగం.. నియంత్రణకు సంబంధించిన అణుశక్తి బిల్ 2025 ద్వారా అణుశక్తి ఉత్పాదనను పంపకాన్నీ ప్రైవేటు కంపెనీలకు అప్పగించబోతున్నారు. ఆదివాసీ, దళిత వెనకబడిన వర్గాలు, అగ్రకులాల్లోని పేద విద్యార్థులకు ఉన్నత విద్యను అందకుండా చూసేందుకు యూజీసీ, ఎఐసీటీఈ, ఎన్‌సీఆఆర్‌టీ లను రద్దు చేశారు. విద్యా కమిషన్ (హిందుస్థాన్ ఎడ్యుకేషన్ కమిషన్ ఏర్పాటు చేయబోతున్నారు. ఎలక్ట్రిసిటీ బిల్లును ప్రవేశపటెట్టి విద్యుత్ ను పూర్తిగా ప్రైవేటు పరం చేయబోతున్నారు. బ్యాంకులను విలీనం చేసి వాటిని కార్పొరేట్ కంపెనీలకు ధారదత్తం చేయబోతున్నారు. దేశ ఆర్థిక వ్యవస్థ ద్రవ్య పెట్టుబడి కంపెనీల, మార్కెట్ శక్తుల చేతుల్లో బందీ అయ్యి ఉన్నది. విదేశీ మదుపరులు షేర్ మార్కెట్ లోని తమ పెట్టుబడులను విదేశాలకు తరలించుకుపోవడం, మరియు ట్రంప్ మన ఎగుమతుల మీద భారీగా సంకాలు విధించడం వంటి కారణాల వల్ల రూపాయి విలువ మరింత పతనమై ఒక డాలర్ కు రూ. 90 రూపాయలు అయ్యింది. దీని వల్ల పెట్రోల్, డీజిల్ వంట నూనెలు ఎల్ పీజీ ధరలు పెరిగి పేద, మధ్య తరగతి వర్గం మీద భరించలేదని భారం పడుతోంది.’ లేఖలో మావోయిస్టు పార్టీ అభిప్రాయపడింది. ఇక ప్రధాని నరేంద్రమోడీ అమెరికా ముందు లొంగిపోయాడని కూడా మావోయిస్టు పార్టీ ఆరోపించింది.
ఆదానీకి మేలు
‘ఎల్‌ఐసీ మీద ఒత్తిడి తీసుకొచ్చి ఆదానీ కంపెనీల్లో 45 వేల కోట్ల రూపాయల షేర్లను కొనుగోలు చేయించారు. మరోవైపు ఆర్ఎస్ఎస్ బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఆదివాసీ, దళిత ఇతర పేద వర్గాల ప్రజల మీద దాడులు పెరుగుతున్నాయి. వర్ణ వ్యవస్థ, మనువాద భావజాలం సనాతన ధర్మం పేరుతో చేస్తూ దాడులు చేయిస్తున్నారు. కులవ్యవస్థ భారత దేశంలో ప్రగతి శీల పాత్రను పోషించింది. మోడీ ప్రభుత్వం ఐఏఎస్, ఐపీఎస్ గ్రూప్ 1 అధికారులను లొంగదీసుకొని తమ ఎజెండాను అమలు జరుపుతోంది. మాట వినని అధికారుల మీద వేధింపులకు గురి చేస్తుననారు. ఈ 11 ఏండ్ల కాలంలో 1500 పైగా అధికారులను వివిధ కారణాలతో తొలగించారు. ఇంతటి ప్రమాద కర పరిస్థఇతులు ఉన్న కారణంగా కార్మికులు, రైతాంగం విద్యార్థులు మేధావులు మహిళలు దళితులు ఆదివాసీలు మైనార్టీలు రచయితలు కళాకారులు మను వాద ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేయాలి’ అంటూ మావోయిస్టు పార్టీ పిలుపునిచ్చింది.
Read Also: గాంధీభవన్ వద్ద రేవంత్ కు వ్యతిరేకంగా పోస్టర్లు
Follow Us On: Facebook