కలం, వెబ్‌డెస్క్: నేటి ఉరుకుల పరుగుల జీవితంలో చాలా మంది ‘ఏకాంతం’ (Loneliness) లేదా ఒంటరితనాన్ని ఒక ప్రశాంతతగా, స్వేచ్ఛగా భావిస్తుంటారు. రోజువారీ ఒత్తిడి, గొడవలకు దూరంగా ఒంటరిగా గడపడం మానసిక ప్రశాంతతను ఇస్తుందని అనుకుంటారు. కానీ, ఆ ఒంటరితనం పరిధి దాటి ఒక అలవాటుగా మారిపోతే.. అది ప్రశాంతత కాదు, మీ ప్రాణాలకే ప్రమాదకరంగా మారుతుందట. ఈ మేరకు బెంగళూరులో ఇటీవల జరిగిన ఒక సదస్సులో నిపుణులు వెల్లడించారు.
నిపుణుల ప్రకారం.. నేటి ఆధునిక కాలంలో ఆర్థికంగా స్థిరపడటం కోసం చాలామంది ఉద్యోగాలు, వ్యాపారాలతో క్షణం తీరిక లేకుండా గడుపుతున్నారు. ఈ క్రమంలో కనీసం కుటుంబ సభ్యులతో, ఆత్మీయులతో మాట్లాడే సమయం కూడా దొరకడం లేదు. ఫలితంగా, తెలియకుండానే ఒంటరితనంలోకి జారిపోతున్నారు.
అయితే, ఈ ఒంటరితనం వారి జీవితాన్ని శాపంగా మారుస్తోందని హెచ్చరిస్తున్నారు. ఒంటరిగా ఉండటం వల్ల శరీరానికి జరిగే నష్టం, రోజుకు 15 సిగరెట్లు తాగడం వల్ల కలిగే నష్టంతో సమానమని చెబుతున్నారు. స్థూలకాయం (Obesity), శారీరక శ్రమ లేకపోవడం వల్ల వచ్చే జబ్బుల కంటే ఒంటరితనం వల్ల వచ్చే ముప్పు చాలా ఎక్కువట. ఒక వ్యక్తి సమాజానికి, బంధుమిత్రులకు దూరంగా ఒంటరిగా గడపడం వల్ల శరీరంలో తీవ్రమైన ప్రతికూల మార్పులు వస్తాయని పరిశోధనలు స్పష్టం చేస్తున్నాయి.
ఆరోగ్యంపై ఒంటరి తనం ప్రభావం
గుండె జబ్బుల ముప్పు
ఒంటరితనం వల్ల హార్ట్ ఎటాక్ వచ్చే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. సాధారణంగా మనం నలుగురితో మాట్లాడితే మనసు ప్రశాంతంగా ఉంటుంది. కానీ మనం ఒంటరిగా ఉంటూ ఎప్పుడూ ఆందోళనలో ఉండడం వల్ల.. 29 శాతం గుండెపోటు వచ్చే అవకాశం, 32 శాతం పక్షవాతం వచ్చే ముప్పు పెరుగుతుందని హెచ్చరిస్తున్నారు.
తీవ్రమైన డిప్రెషన్, యాంగ్జయిటీకి దారితీస్తుంది
ఎప్పుడూ ఒంటరిగా గడుపుతూ, మానసికంగా ఒంటరితనాన్ని అనుభవించడం వల్ల తీవ్రమైన డిప్రెషన్ (మానసిక కుంగుబాటు), యాంగ్జయిటీ (ఆందోళన) వంటి సమస్యలు చుట్టుముట్టే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. ఇతరులతో మనసు విప్పి మాట్లాడకపోవడం వల్ల లోపల ఉన్న ఒత్తిడి పెరిగిపోయి, అది క్రమంగా మానసిక ఆరోగ్యాన్ని పూర్తిగా దెబ్బతీస్తుందట.
రోగనిరోధక శక్తి క్షీణిస్తుంది
ఎప్పుడూ ఒంటరిగా ఉండటం వల్ల శరీరంలో ఒత్తిడిని పెంచే హార్మోన్లు (కార్టిసోల్ వంటివి) విపరీతంగా విడుదలవుతాయట. ఇది క్రమంగా మన రోగనిరోధక వ్యవస్థను (Immunity) తీవ్రంగా బలహీనపరుస్తుంది. దీనివల్ల శరీరం ఇన్ఫెక్షన్లతో పోరాడే శక్తిని కోల్పోయి, సీజనల్ వ్యాధులు, ఇతర ఇన్ఫెక్షన్ల బారిన త్వరగా పడే ప్రమాదం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు.
జ్ఞాపకశక్తి తగ్గడం
ఒంటరితనం మెదడు పనితీరుపై కూడా తీవ్ర ప్రభావం చూపిస్తుందట. ఇతరులతో సంభాషణలు, సామాజిక సంబంధాలు లేకపోవడం వల్ల మెదడు చురుకుదనం తగ్గుతుందని చెబుతున్నారు. ముఖ్యంగా వృద్ధులలో ఈ ఒంటరితనం వల్ల జ్ఞాపకశక్తి తగ్గిపోవడమే కాకుండా, మతిమరుపు వ్యాధి అయిన ‘అల్జీమర్స్’ వచ్చే ప్రమాదం రెట్టింపు అవుతుందని వైద్యులు స్పష్టం చేస్తున్నారు.
ఈ సమస్య నుంచి బయటపడే మార్గాలు
మనిషిక నీరు, ఆహారం ఎంత అవసరమో సామాజిక అనుబంధం కూడా అంతే అవకసరమని చెబుతున్నారు. మనుషులతో కలవకపోవడం వల్ల శరీరం నిరంతరం ఒత్తిడికి గురై కాలక్రమేణా ప్రాణాంతకంగా మారుతుందని హెచ్చరిస్తున్నారు. ఈ డిజిటల్ యుగంలో సోషల్ మీడియాలో వందల మంది ఫ్రెండ్స్ ఉన్నా మనం ఒంటరితనాన్ని దూరం చేసుకోవాలంటే.. మనకు కచ్చితంగా నిజమైన బంధాలు కావల్సిందేనని చెబుతున్నారు.
- ఫోన్ పక్కన పెట్టి కుటుంబ సభ్యులతో సమయం గడపడం
- వారానికి ఒకసారైనా పాత స్నేహితులు లేదా బంధువులను కలవడం
- పార్కులకు వెళ్లడం, నలుగురితో కలిసి యోగా లేదా వాకింగ్ చేయడం, సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొనడంః
ఆరోగ్యం అంటే కేవలం మంచి ఆహారం తినడం, జిమ్‌కి వెళ్లడం మాత్రమే కాదని, నలుగురితో నవ్వుతూ, సంతోషంగా గడపడం కూడా అని చెబుతున్నారు నిపుణులు. కాబట్టి, ఒంటరితనాన్ని దూరం చేసుకోండి.. నిండు నూరేళ్లు ఆరోగ్యంగా జీవించండి.

