కలం, కరీంనగర్ బ్యూరో : గురు బ్రహ్మ.. గురు విష్ణు.. అని మన చదువుల తల్లి నేర్పిన పాఠం. కానీ నేడు కార్పొరేట్ విద్యా సంస్థల నిఘంటువులో ‘గురువు’ అంటే కేవలం ఒక ‘సేల్స్ రిప్రజెంటేటివ్’ మాత్రమే! అనే విమర్శలు ఉన్నాయి. అవును.. ఎండలు మండుతున్నా, సెలవులు వచ్చినా ప్రైవేట్ టీచర్స్ (Private Teachers) కి విశ్రాంతి లేదు. పాఠాలు చెప్పాల్సిన నోళ్లు ఇప్పుడు అడ్మిషన్ల కోసం బతిమాలుతున్నాయి. టార్గెట్లు రీచ్ కాకపోతే జీతాల్లో కోతలు.. ఉద్యోగాల తొలగింపులు.
విద్యా వ్యవస్థ ఎటు పోతోంది?
అక్షరాలతో విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దాల్సిన టీచర్లు, ఇప్పుడు అడ్మిషన్ల వేటలో వీధుల పాలవుతున్నారు. టార్గెట్ పూర్తి చేయకపోతే ఏప్రిల్, మే నెలల జీతాలు ఉండవంటూ కార్పొరేట్ యాజమాన్యాలు హుకుం చేస్తున్నారు. లైవ్ లొకేషన్ల పేరుతో టీచర్లపై థర్డ్ గ్రేడ్ నిఘా చూపెడుతున్నారు. ఎండలో తిరుగుతున్నారా లేదా అని వాట్సాప్ గ్రూపుల ద్వారా ఆరా తీస్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా జరుగుతున్న ఈ అరాచకాలపై విద్యాశాఖ మౌనం వహించడం వెనుక మర్మమేంటి? అని విమర్శకులు ప్రభుత్వాన్ని దుయ్యబడుతున్నారు.
చదువు ‘వ్యాపారం’.. టీచర్ ‘యంత్రం’
సాధారణంగా మే నెలలో పిల్లలకు సెలవులు ఉంటాయి. కానీ ప్రైవేటు టీచర్లకు ఇవి ‘శిక్షా’ మాసాలు. ఒక్కో టీచర్‌కు 10 నుంచి 20 అడ్మిషన్ల టార్గెట్ విధిస్తున్నారు. అడ్మిషన్ వస్తేనే జీతం.. లేదంటే పస్తులుండాల్సిందే. కొన్ని స్కూళ్లలో అయితే అడ్మిషన్ల ఇన్సెంటివ్స్ ఆశ చూపి, రిజిస్ట్రేషన్ ఫీజుల పేరుతో ముక్కు పిండి వసూళ్లు చేస్తున్నారు.
ఎండ తీవ్రత దృష్ట్యా ప్రజలు బయటకు రావొద్దని ప్రభుత్వం హెచ్చరిస్తున్నా కార్పొరేట్ స్కూళ్లు మాత్రం టీచర్లను రోడ్ల మీద తిప్పుతున్నాయి. లైవ్ లొకేషన్ షేర్ చేయాలనే నిబంధన పెట్టడం వారి వ్యక్తిగత స్వేచ్ఛను హరించడమే అనే విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. అకౌంటెంట్లు, రిసెప్షనిస్టులను సైతం వదలకుండా ఫీల్డ్ వర్క్‌కు పంపుతున్నారంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.
నిద్రపోతున్న విద్యా చట్టాలు!
విద్యా చట్టాల ప్రకారం ఉపాధ్యాయులను బోధనేతర పనులకు (ఎన్నికలు, జనాభా లెక్కలు మినహా) ఉపయోగించకూడదు. మరి చదువు చెప్పే టీచర్లను మార్కెటింగ్ ఏజెంట్లుగా మార్చుతుంటే అధికారులు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు..? కార్మిక చట్టాల అమలు ఎక్కడ..? అనే ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి. గురువు గౌరవప్రదంగా బతికినప్పుడే సమాజం బాగుంటుంది.. కానీ వారు బతకడానికి ‘అడ్మిషన్ల భిక్ష’ అడుక్కోవాల్సిన పరిస్థితి రావడం విచారకరం. ఇప్పటికైనా ప్రభుత్వం, విద్యాశాఖ స్పందించి ఈ కార్పొరేట్ ఆగడాలకు అడ్డుకట్ట వేయాలని ప్రైవేట్ టీచర్లు డిమాండ్ చేస్తున్నారు. ఉపాధ్యాయులను కేవలం ఉపాధ్యాయులుగానే చూడాలి తప్ప, లాభాలు తెచ్చిపెట్టే మిషన్లుగా కాదు! కదా? అని విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.

