కలం, వెబ్ డెస్క్: తెలంగాణ ఉద్యమకారుల సంఘాలతో టీఆర్ఎస్ చీఫ్ కల్వకుంట్ల కవిత సమావేశమయ్యారు. ఉద్యమకారుల సమస్యలు, ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీల అమలు తదితర అంశాలపై చర్చించారు. తెలంగాణ ఉద్యమకారుల డిమాండ్లకు కవిత పూర్తి మద్దతు ప్రకటించారు.
జూన్ 2 లోపు హామీలు నెరవేర్చండి
ఎన్నికలకు ముందు ఉద్యమకారులకు కాంగ్రెస్ ఇచ్చిన హామీలను జూన్ 2లోపు అమలు చేయాలని ఆమె డిమాండ్ చేశారు. అప్పటికీ హామీలు అమలు కాకపోతే ఉద్యమకారులతో కలిసి ప్రత్యక్ష ఆందోళనలు చేపడతామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. జార్ఖండ్ ప్రభుత్వం ఉద్యమకారులకు అమలు చేస్తున్న సంక్షేమ పథకాల మాదిరిగా తెలంగాణలో కూడా ప్రత్యేక సంక్షేమ పథకాలు అమలు చేయాలని కవిత కోరారు. ఉద్యమకారుల సంక్షేమం కోసం ప్రభుత్వం స్పష్టమైన విధానాన్ని ప్రకటించాలని డిమాండ్ చేశారు.
భువనగిరిలో భారీ సభ
హామీల అమలుపై ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకు భువనగిరి జిల్లా కేంద్రంలో భారీ సభ నిర్వహించాలని సమావేశంలో నిర్ణయించారు. అలాగే భూపోరాటాలను ఉధృతం చేయడంతో పాటు జిల్లాల వారీగా ఉద్యమకారులతో సమావేశాలు నిర్వహించాలని తీర్మానించారు. సమావేశం అనంతరం కల్వకుంట్ల కవిత ఉద్యమకారులతో కలిసి సహపంక్తి భోజనం చేశారు.

