కలం, వరంగల్ బ్యూరో: రాష్ట్రంలో అత్యధిక క్రిమినల్ కేసులు ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య (Thatikonda Rajaiah) విమర్శించారు. తెలంగాణ నీళ్లను ఆంధ్రకు దోచిపెడుతూ, రాహుల్ గాంధీకి కప్పం కడుతున్నారని ఆరోపించారు. స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి గురువారం కేటీఆర్‌పై చేసిన వ్యాఖ్యలపై సోషల్ మీడియా వేదికగా రాజయ్య స్పందించారు. తమ నాయకుడు కేటీఆర్‌పై చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు. సభ్యత, సంస్కారాల గురించి మాట్లాడే నైతికత కడియం శ్రీహరికి లేదన్నారు. పెద్ద నాయకులను తిడితే తానే పెద్ద లీడర్ అయిపోతానని ఆయన చెలరేగిపోతున్నారని మండిపడ్డారు.
రేవంత్ రెడ్డిని తమ నాయకుడు కేటీఆర్ ‘తెలంగాణ ద్రోహి’ అని ఎందుకు అనాల్సి వచ్చిందో గ్రహించాలన్నారు. రేవంత్ రెడ్డి ఏనాడూ తెలంగాణ కోసం ఉద్యమం చేసిన వ్యక్తి కాదని, జెండా పట్టిన వ్యక్తి అసలే కాదని విమర్శించారు. గత రెండున్నర సంవత్సరాలలో ‘జై తెలంగాణ’ అనే పదం కూడా ఆయన నోటి వెంట రాలేదని గుర్తుచేశారు. రేవంత్ రెడ్డి మాదిరిగానే ఇక్కడి ఎమ్మెల్యే కడియం శ్రీహరి కూడా బీఆర్ఎస్ నాయకులు రాత్రింబవళ్లు కష్టపడి గెలిపిస్తే, తన బిడ్డ భవిష్యత్తు కోసం నియోజకవర్గాన్ని తాకట్టు పెట్టి కాంగ్రెస్ పార్టీలో చేరారని దుయ్యబట్టారు. కేటీఆర్ గురించి మాట్లాడేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలని, తన ఇంటి నిర్మాణం కోసం కేసీఆర్, కేటీఆర్ దగ్గరకు వెళ్లి డబ్బులు అడుక్కున్న విషయం కడియం శ్రీహరి మర్చిపోయావా? అని రాజయ్య తీవ్రస్థాయిలో ఆరోపణలు చేశారు.

