కలం వెబ్ డెస్క్: తెలంగాణ ఆర్టీసీ (TGSRTC)లో తీవ్ర విషాద ఘటన చోటు చేసుకుంది. సమ్మె చేస్తున్న తమ ఆర్టీసీ కార్మికుల డిమాండ్లు నెరవేర్చాలని కోరుతూ నర్సంపేటలో ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డ డ్రైవర్ శంకర్ గౌడ్ (Driver Shankar Goud) శుక్రవారం తెల్లవారుజామున 2.30 గంటలకు మృతి చెందాడు. తమ డిమాండ్లు నెరవేర్చాలని ఆర్టీసీ కార్మికులు బుధవారం నుంచి సమ్మెకు దిగారు. ఈ క్రమంలో గురువారం ఆర్టీసీ జేఏసీ మహాధర్నా చేపట్టింది. నర్సంపేట బస్టాండ్ ఆవరణలో నిరసన తెలిపిన శంకర్ గౌడ్ పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేశాడు. తీవ్ర గాయాలపాలైన శంకర్‌ను వరంగల్ ఎంజీఎంకు తరలించారు. మెరుగైన చికిత్స కోసం అక్కడి నుంచి హైదరాబాద్ తీసుకెళ్లారు. కంచన్‌బాగ్ డీఆర్డీవో అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శంకర్ మృతి చెందారు. శంకర్ గౌడ్ మృతితో ఆర్టీసీ కార్మికులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. ప్రభుత్వం చర్చలకు సిద్ధమంటున్న తరుణంలో శంకర్ ప్రాణాలు కోల్పోవడం కార్మికులను ఆవేదనకు గురి చేస్తోంది. ఉస్మానియా ప్రత్యేక వైద్య బృందంతో పోస్ట్‌మార్టం నిర్వహించి, స్వగ్రామానికి శంకర్‌గౌడ్ మృతదేహాన్ని తరలించనున్నారు. శంకర్ గౌడ్ మృతితో నేడు నర్సంపేట బంద్‌కు పిలుపునిచ్చారు.

