ఆర్టీసీ కార్మికుల సమ్మెపై నేడు మరోసారి చర్చ

కలం, తెలంగాణ బ్యూరో : ఆర్టీసీ కార్మికులు రెండు రోజులుగా చేస్తున్న నిరవధిక సమ్మె (TGSRTC strike)పై క్యాబినెట్ సమావేశం లోతుగా చర్చించింది. ప్రయాణికులకు కలుగుతున్న ఇబ్బందులు, సంస్థ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని సమ్మెను విరమించాల్సిందిగా అప్పీల్ చేసింది. సమస్యల పరిష్కారం, డిమాండ్లను నెరవేర్చడంపై ప్రభుత్వం సానుకూలంగా ఉన్నదని నొక్కిచెప్పింది. చర్చల ద్వారానే సమస్యలు పరిష్కారమవుతాయని కార్మికులకు వివరించిన ప్రభుత్వం.. డిప్యూటీ సీఎం నేతృత్వంలో మంత్రుల కమిటీని నియమించింది. సచివాలయంలో శుక్రవారం ఉదయం కార్మిక సంఘాల ప్రతినిధులతో ఈ కమిటీ సమావేశం కానున్నది. వీలైనంత తొందరగా సమ్మెను ముగించడానికి చొరవ తీసుకోనున్నది. కార్మిక సంఘాలు లేవనెత్తిన మొత్తం 32 డిమాండ్లలో మూడు తప్ప మిగిలినవాటిపై ప్రభుత్వం పాజిటివ్‌గా ఉన్నదని రవాణా మంత్రి పొన్నం ప్రభాకర్ మీడియా సమావేశంలో స్ప్టష్టం చేశారు. సమ్మె ప్రారంభమైన తర్వాత ఫస్ట్ టైమ్ ప్రభుత్వం చర్చలు జరుపుతున్నది.

కాంగ్రెస్ ప్రభుత్వంలో ఫస్ట్ ఆత్మార్పణం :

గత ప్రభుత్వంలో 52 రోజుల పాటు సమ్మె చేసిన ఆర్టీసీ కార్మికులు అప్పటి సీఎం కేసీఆర్ మాటలను తట్టుకోలేక 34 మంది ఆత్మహత్య చేసుకున్నారు. ఆత్మగౌరవం దెబ్బతినేలా కేసీఆర్ మాట్లాడారని మనస్థాపం చెంది ఆత్మహత్య చేసుకున్నట్లు బాధిత కుటుంబాల సభ్యులు బహిరంగంగానే చెప్పారు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరిన తర్వాత ఆర్టీసీ కార్మికులు జరుపుతున్న తొలి సమ్మె. డిమాండ్ల సాధన కోసం నర్సంపేట డ్రైవర్ శంకర్ గౌడ్ ఒంటిపై పెట్రోలు పోసుకుని నిఫ్పంటించుకున్నారు. ఈ ప్రభుత్వంలో ఇది ఫస్ట్ ఇన్సిడెంట్. వెంటనే తోటి కార్మికులు ఆయనను వరంగల్‌లోని ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. ప్రభుత్వ ఆదేశం మేరకు మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ తరలిస్తుండగా ఆంబులెన్సులోనే కర్మన్‌ఘాట్ దగ్గర చనిపోయారు. మృతదేహాన్ని కంచన్‌బాగ్ డీఆర్‌డీవో ఆస్పత్రిలో ఉంచారు. మరోవైపు నల్లగొండ, ఖమ్మం జిల్లాల్లోనూ ఇద్దరు ఆర్టీసీ కార్మికులు ఆత్మహత్యాయత్నం చేశారు.

తొందరపాటు నిర్ణయాలు వద్దు : సీఎం రేవంత్‌రెడ్డి

క్యాబినెట్ సమావేశం జరుగుతున్న సమయంలోనే ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆర్టీసీ కార్మికులకు అప్పీల్ చేశారు. కార్మికులు సంయమనం పాటించాలని, చర్చల ద్వారా సమస్యలను పరిష్కరించుకోవాలని కోరారు. ప్రభుత్వం కూడా పరిష్కారం కోసం చిత్తశుద్ధితో ఉన్నదని వివరించారు. సమస్యలను పరిష్కరించాలనే సానుకూల వైఖరితో ప్రభుత్వం ఉన్నందునే అధికారులతో కమిటీ వేసిందని సీఎం ఒక ప్రకటనలో కార్మికులకు గుర్తుచేశారు. ఆ కమిటీ జరిపిన చర్చలు ఫలవంతం కాకపోవడంతో సమ్మె అనివార్యమైందని, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆధ్వర్యంలో సచివాలయంలో శుక్రవారం మరోమారు ఆర్టీసీ కార్మిక సంఘాల ప్రతినిధులతో చర్చలు జరగనున్నాయని ఆ ప్రకటనలో పేర్కొన్నారు. చర్చల ద్వారా సమస్యలను పరిష్కరించుకోవాలని కోరారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>