కలం, వనపర్తి: మహిళా సాధికారత, గ్రామీణాభివృద్ధి, ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య అందించడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి (MLA Megha Reddy) అన్నారు. శ్రీరంగాపురం మండల కేంద్రంలో సోమవారం ఆయన పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు నిర్వహించారు. మొదట రూ.10 లక్షల వ్యయంతో నిర్మించనున్న గ్రామ మహిళా సమాఖ్య భవనానికి, మరో రూ.10 లక్షలతో నిర్మించనున్న మండల మహిళా సమాఖ్య భవనానికి శంకుస్థాపన చేశారు. అనంతరం రూ.30 లక్షల వ్యయంతో నిర్మించనున్న గోదాం భవనానికి భూమిపూజ నిర్వహించారు. అనంతరం స్థానిక ప్రభుత్వ పాఠశాలలో రూ.14.50 లక్షలతో ఏర్పాటు చేసిన పీఎం శ్రీ (PM SHRI) కంప్యూటర్ ల్యాబ్‌ను ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యేకు విద్యార్థులు, ఉపాధ్యాయులు పుష్పగుచ్ఛాలు అందించి ఘన స్వాగతం పలికారు. ఈ క్రమంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాలల్లో ఆధునిక సౌకర్యాలు కల్పిస్తూ డిజిటల్ విద్యకు ప్రాధాన్యం ఇస్తున్నామని తెలిపారు. ప్రతి విద్యార్థికి నాణ్యమైన విద్య అందేలా ప్రభుత్వం కృషి చేస్తోందని, ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు ప్రైవేట్ పాఠశాలలకు ఏమాత్రం తీసిపోకుండా అన్ని సౌకర్యాలు కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. మహిళల ఆర్థిక, సామాజిక సాధికారతకు ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని, మహిళా సమాఖ్యలకు శాశ్వత భవనాలు ఏర్పాటు చేయడం ద్వారా సమావేశాలు, శిక్షణా కార్యక్రమాలు, స్వయం ఉపాధి కార్యకలాపాలకు మరింత ఊతం లభిస్తుందని పేర్కొన్నారు. అభివృద్ధి పనులను నాణ్యతతో, నిర్ణీత గడువులో పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ మద్దిలేటి, పెబ్బేరు మార్కెట్ యార్డ్ అధ్యక్షురాలు ప్రమోదిని రెడ్డి, ఉపాధ్యక్షుడు విజయవర్ధన్ రెడ్డి, కాంగ్రెస్ నాయకులు శ్రీహరి రాజు, వివిధ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

