అంపైర్లతో వాగ్వాదం.. దక్షిణాఫ్రికా కోచ్‌కు ఐసీసీ షాక్

క‌లం, స్పోర్ట్స్: అంపైర్ల నిర్ణయాన్ని ప్రశ్నించినందుకు దక్షిణాఫ్రికా బ్యాటింగ్ కోచ్ ఆష్‌వెల్ ప్రిన్స్ (Ashwell Prince), ఆటగాడు కైల్ వెర్రెయిన్‌పై ఐసీసీ చర్యలు తీసుకుంది. ఇద్దరికీ అధికారికంగా హెచ్చరిక జారీ చేసింది. అంతేకాదు, వారి క్రమశిక్షణ రికార్డుల్లో ఒక్కో డీమెరిట్ పాయింట్‌ను చేర్చింది. ఆస్ట్రేలియాతో కేప్‌టౌన్‌లో జరిగిన మూడో టెస్టులో మూడో రోజు చోటుచేసుకున్న ఘటనపై ఐసీసీ ఈ నిర్ణయం తీసుకుంది. దక్షిణాఫ్రికా రెండో ఇన్నింగ్స్‌లో ఓపెనర్ మార్కెస్ అకెర్మన్ క్యాచ్ ఔట్‌గా వెనుదిరిగాడు. అయితే ఈ నిర్ణయాన్ని సమీక్షించాలని అతడు ప్రయత్నించాడు. కానీ నిర్ణీత 15 సెకన్లలోపు రివ్యూ కోరలేదని అంపైర్లు స్పష్టం చేశారు. దీంతో అతడి అప్పీల్‌ను తిరస్కరించారు.

అకెర్మన్ మైదానం వీడుతున్న సమయంలో ఆష్‌వెల్ ప్రిన్స్ అంపైర్ల నిర్ణయంపై అసంతృప్తి వ్యక్తం చేశాడు. రివ్యూ తీసుకోవడానికి ఇంకా సమయం ఉందని పలుమార్లు అంపైర్లకు చెప్పాడు. మరోవైపు తుది జట్టులో లేని కైల్ వెర్రెయిన్ కూడా అకెర్మన్‌ను బౌండరీ లైన్ లోపలే ఉండాలని కోరాడు. దీంతో అతడు మైదానం వీడటంలో ఆలస్యమైంది. ఈ వ్యవహారాన్ని ఐసీసీ తీవ్రంగా పరిగణించింది. అంతర్జాతీయ మ్యాచ్‌లో అంపైర్ల నిర్ణయంపై అసమ్మతి వ్యక్తం చేయకూడదనే నిబంధనలోని ఆర్టికల్ 2.8ను ఇద్దరూ ఉల్లంఘించినట్లు తేల్చింది. 24 నెలల వ్యవధిలో ఇదే తొలి తప్పిదం కావడంతో ఒక్కొక్కరికి ఒక డీమెరిట్ పాయింట్‌తో పాటు అధికారిక హెచ్చరిక జారీ చేసింది.

మ్యాచ్ రిఫరీ జవగళ్ శ్రీనాథ్ ప్రతిపాదించిన చర్యలను ప్రిన్స్, వెర్రెయిన్ అంగీకరించారు. తమ తప్పును కూడా ఒప్పుకున్నారు. దీంతో అధికారిక విచారణ అవసరం లేకుండానే చర్యలు పూర్తయ్యాయి. మైదానంలో అంపైర్లు రిచర్డ్ ఇల్లింగ్‌వర్త్, రిచర్డ్ కెటిల్‌బరో, థర్డ్ అంపైర్ క్రిస్ గఫానీ, ఫోర్త్ అంపైర్ లుబాలాలో గ్కుమా ఈ ఆరోపణలు చేశారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>