కలం, ఖమ్మం బ్యూరో: ఉమ్మడి ఖమ్మం జిల్లాలో అన్నదాతల పరిస్థితి ప్రస్తుతం అంతులేని ఆవేదనను, కన్నీళ్లను మిగులుస్తోంది. ఆరుగాలం కష్టపడి, ఎండనకా వాననకా కాపాడుకున్న పంట చేతికి వచ్చే సమయంలో ప్రకృతి వరుస వైపరీత్యాలతో పగబట్టినట్లు విరుచుకుపడుతోంది. ఏడాది ప్రారంభంలో ఎల్ నినో ప్రభావం (El Nino Impact) వల్ల సరిగ్గా వర్షాలు పడక, సాగునీరు అందక అల్లాడిపోయిన రైతాంగానికి (Khammam Farmers).. ఇప్పుడు కోలుకోలేని విధంగా తుఫానుల రూపంలో పెను ముప్పు ముంచుకొస్తుంది. పంట కోత దశలో ఉన్న సమయంలో తుఫానులు రావడంతో దిగుబడి తగ్గుతుందనే భయం వారిని వెంటాడుతుంది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ బోర్డర్ జిల్లాలైన ఖమ్మం, కొత్తగూడెం జిల్లా రైతులకు తుఫాను ప్రభావం ఎక్కువగా ఉండడంతో, వారు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు.
1,138 ఎకరాల్లో నేలకూలిన వరి పంట..
కొద్ది రోజుల క్రితం ‘అర్నబ్’ తుఫాన్ సృష్టించిన బీభత్సంతో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా సుమారు 1,138 ఎకరాల్లో వరి పంట నేలకూలింది. ఆ నష్టపు గాయాలు ఇంకా మానకముందే, తాజాగా మరో విపత్తు రైతన్నల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తోంది. నవంబర్ 3, 4 తేదీల్లో అతి భారీ వర్షాలు పడతాయని ఇప్పటికే వాతావరణ శాఖ హెచ్చరికలు జరీ చేసింది. అందులో భాగంగానే ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా సోమవారం ఉదయం నుంచే ఆకాశం పూర్తిగా మేఘావృతమై ముసురు పట్టింది. కొత్తగూడెం పరిసర ప్రాంతాల్లో కొన్ని చోట్ల రైతులు వరి కోతలు వాయిదా వేసుకున్నారు. అయితే ఇప్పటికే వరి కోతలు పూర్తి అయినా రైతులు…చినుకులు పడుతుండటంతో, కళ్ల ముందే ఆరబోసిన ధాన్యం తడిసిపోతుందనే భయం వారిని తీవ్రంగా కృంగదీస్తోంది.
ప్రాణం తీసిన రోడ్లపై వడ్లు..
అయితే, ఈ తుఫాన్ భయంతో పంటను కాపాడుకునే తపనలో రైతులు రోడ్లపైనే ధాన్యం ఆరబోస్తుండటం మరో పెద్ద విషాదానికి, ప్రాణ నష్టానికి దారితీస్తోంది. రాత్రి, తెల్లవారుజాము వేళల్లో వేగంగా వచ్చే వాహనదారులకు రోడ్లపై ఆరబోసిన ధాన్యం రాశులు చీకట్లో అస్సలు కనిపించడం లేదు. ఫలితంగా అమాయకుల ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయి. సత్తుపల్లి మండలం తుంబూరుకు చెందిన తురక రాంబాబు(40)కు ఆదివారం రాత్రి అలాంటి ఘోరమే జరిగింది. అత్తారింటికి బైక్ పై వెళ్తుండగా సదాశివునిపేటలో రోడ్డుపై ఆరబోసిన ధాన్యం రాశి చీకట్లో కనిపించక దానిపైకి దూసుకెళ్లాడు. బైక్ అదుపుతప్పి కిందపడటంతో తీవ్రగాయాలపాలై అక్కడికక్కడే దుర్మరణం చెందాడు.
ఆదుకోవాలని రైతుల ఆవేదన..
పంటను కాపాడుకునే క్రమంలో రోడ్లపై ధాన్యం ఆరబోయడం వల్ల విలువైన ప్రాణాలు బలవుతుండటం స్థానికంగా తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. ఒకవైపు తెగుళ్ల బారిన పడిన, ఎండిన పంట కష్టాలు, మరోవైపు ముంచుకొస్తున్న తుఫాన్ ముసురు, ఇంకోవైపు రోడ్డు ప్రమాదాల రూపంలో జరుగుతున్న ప్రాణ నష్టం ఉమ్మడి ఖమ్మం జిల్లాల్లో కంటతడి పెట్టించే దృశ్యాలను ఆవిష్కరిస్తున్నాయి. ఈ క్లిష్ట పరిస్థితిలో ప్రభుత్వ యంత్రాంగం తక్షణమే స్పందించి, రైతులు రహదారులపై ధాన్యం ఆరబోయకుండా అవగాహనా కల్పించాలని, అలాగే పంట తెగుళ్లు, నష్టాల బారిన పడిన రైతులను ఆదుకోవాలని కోరుతున్నారు.
మందడపు నాగకృష్ణ – రైతు, మల్లారం గ్రామం, మధిర
నాలుగు లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టి నాలుగు ఎకరాలు మిరపతోట వేశాను. ఎల్నినో ప్రభావం వలన వాతావరణ పరిస్థితులు అనుకూలించక పోవడం వలన తెగుళ్లు వ్యాపించాయి. ఎన్ని మందులు వాడినా ఫలితం కనిపించలేదు. అంతేకాక పక్క పొలాలకు కూడా తెగుళ్లు సోకడం ప్రారంభించాయి. చేసేది లేక నాలుగు ఎకరాల పంటను నా చేతులతోనే దున్నాల్సి వచ్చింది.

