కలం, తెలంగాణ బ్యూరో: వినియోగదారులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి దక్షిణ డిస్కం (TGSPDCL) వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఇకపైన ప్రతి మంగళవారం, గురువారం ప్రజల దగ్గరకే వెళ్లి వారి సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించేలా ‘ప్రజా బాట – బస్తీ బాట’ (Praja Bata-Basti Bata )అనే కార్యక్రమాన్ని మొదలుపెడుతున్నది. దక్షిణ డిస్కం పరిధిలోని మొత్తం 21 సర్కిళ్లలో దీన్ని నేటి నుంచే ప్రారంభించనున్నారు. ప్రతి మంగళవారం, గురువారాల్లో జరిగే ఈ కార్యక్రమం ద్వారా టీజీఎస్పీడీసీఎల్ అధికారులు వినియోగదారుల వద్దకే వెళ్లి విద్యుత్ సంబంధిత సమస్యలను తెలుసుకుని, తక్షణ పరిష్కారానికి చర్యలు తీసుకుంటారని సీఎండీ జితేష్ పాటిల్ తెలిపారు.
ప్రజా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ‘ప్రజల వద్దకే పాలన’ భావనకు అనుగుణంగా విద్యుత్ వినియోగదారులకు మరింత చేరువయ్యే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని అమలు చేయనున్నట్లు చెప్పారు. విద్యుత్ వినియోగదారులు కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా.. డిస్కం అధికారులు, ఇంజినీర్లు, సిబ్బందే నేరుగా బస్తీలు, కాలనీలు, గ్రామాలు, తండాలు, పట్టణ ప్రాంతాలకు వెళ్లి వినియోగదారులను కలిసి వారి సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకొని, వీలైనంత వరకు అక్కడికక్కడే పరిష్కరించేలా ఈ కార్యక్రమాన్ని రూపొందించినట్లు వివరించారు.
విద్యుత్ పంపిణీ మెకానిజం బలోపేతమయ్యేలా
– విద్యుత్ సరఫరా నాణ్యత, విశ్వసనీయతపై ప్రజల అభిప్రాయాలను తెలుసుకోవడంతో పాటు, ఫీల్డ్ స్థాయిలో ఉన్న సమస్యలను గుర్తించి వెంటనే పరిష్కరించే ప్రక్రియకు ఈ కార్యక్రమం వేదికగా నిలుస్తుందని టీజీఎస్పీడీసీఎల్ సీఎండీ జితేష్ పాటిల్ పేర్కొన్నారు.
– ‘ప్రజాబాట–బస్తీబాట’ కార్యక్రమంలో భాగంగా పంపిణీ వ్యవస్థను బలోపేతం చేసే పనులను విస్తృతం చేయడం, ట్రాన్స్ ఫార్మర్ల నిర్వహణ, యార్డుల పరిశుభ్రత, వోల్టేజ్ సమస్యల పరిష్కారం, విద్యుత్ తీగల సమస్యలను చక్కదిద్దడం, అవసరమైనచోట స్థంభాల ఏర్పాటు, దెబ్బతిన్న/తుప్పుపట్టిన విద్యుత్ స్తంభాల మార్పిడి, తదితర పనులకు ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు ఆయన తెలిపారు.
– వరదలకు గురయ్యే ప్రాంతాల్లో ట్రాన్స్ ఫార్మర్ల ఎత్తు పెంచడం, పంపిణీ వ్యవస్థ ఆధునికీకరణ, రిపేర్లు, పునరుద్ధరణ పనులను వేగవంతం చేసి నిరంతర విద్యుత్ సరఫరా కోసం అవసరమైన చర్యలు చేపట్టడం కూడా ఇందులో భాగమని సీఎండీ చెప్పారు. కొత్త విద్యుత్ కనెక్షన్లు, అదనపు లోడ్, పేరు మార్పు, కేటగిరీ మార్పు, బిల్లింగ్ సమస్యలు, పెండింగ్లో ఉన్న ఫిర్యాదులు, ఇతర సమస్యలను ప్రాధాన్యత క్రమంలో పరిశీలించి వేగంగా పరిష్కరించేందుకు అధికారులు చర్యలు తీసుకుంటారన్నారు.
– ప్రతి ఫిర్యాదును సంబంధిత ఇంజినీర్లు నేరుగా పర్యవేక్షించి, పరిష్కారానికి నిర్దిష్ట కార్యాచరణ రూపొందిస్తారని సీఎండీ తెలిపారు. ప్రజల సమస్యలను మధ్యవర్తుల ప్రమేయం లేకుండా నేరుగా అధికారుల దృష్టికి తీసుకురావడం ద్వారా అవినీతికి తావులేకుండా, ప్రజా సేవలను మరింత సమర్థవంతంగా అందించే వ్యవస్థను ఈ కార్యక్రమం బలోపేతం చేస్తుందన్నారు.
– ‘ప్రజలు మా కార్యాలయాలకు రావాల్సిన అవసరం లేదు.. విద్యుత్ శాఖ సిబ్బందే వారి ఇండ్లకు వెళ్తారు.. సమస్యలను తెలుసుకుంటారు.. పరిష్కరిస్తారు..’ అని టీజీఎస్పీడీసీఎల్ సీఎండీ వివరించారు. ప్రతి ఫిర్యాదును పారదర్శకంగా, వేగంగా పరిష్కరించడం ద్వారా నాణ్యమైన, విశ్వసనీయమైన, నిరంతర విద్యుత్ సేవలను అందించడమే లక్ష్యమన్నారు. గ్రామం నుంచి నగరం వరకు ప్రతి వినియోగదారుడికి విద్యుత్ సేవలు మరింత చేరువ కావాలన్నారు.

