కలం, తెలంగాణ బ్యూరో: ఆర్డీవో స్థాయిలో ప్రజావాణి (Prajavani) నిర్వహించాల్సిన అవసరం లేదని రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్, ప్రజావాణి ఇన్చార్జ్ చిన్నారెడ్డి (Chinna Reddy) అభిప్రాయపడ్డారు. మండలం, జిల్లా, రాష్ట్ర స్థాయిల్లో ప్రజావాణి నిర్వహిస్తే సరిపోతుందని బుధవారం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. చాలా ఆర్డీవో కార్యాలయాలు కలెక్టరేట్‌లో లేదా దాని సమీపంలో ఉన్నందున, మండలం-జిల్లా స్థాయి ప్రజావాణిల మధ్య మరో కార్యక్రమం నిర్వహించడం అవసరం లేదని తెలిపారు. ఇది తన వ్యక్తిగత అభిప్రాయమని స్పష్టం చేసిన చిన్నారెడ్డి.. ఈ అంశంపై సీఎం రేవంత్ రెడ్డి, ప్రణాళిక శాఖ ఉన్నతాధికారులు పునరాలోచించి తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు.

