కలం, వెబ్‌డెస్క్: ఉన్నత విద్య కోసం అమెరికాకు వెళ్లే తెలంగాణ విద్యార్థుల కోసం వీసాల సంఖ్యను పెంచాలని, వీసా అపాయింట్‌మెంట్లు సకాలంలో లభించేలా సహకరించాలని అమెరికా రాయబారి సెర్జియో గోర్‌ను సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) కోరారు. ఢిల్లీలో పర్యటనలో ఉన్న సీఎం బుధవారం సాయంత్రం అక్కడ సెర్జియో గోర్‌తో సమావేశమయ్యారు. అరగంటకు పైగా జరిగిన మర్యాదపూర్వక భేటీలో వివిధ అంశాలను ముఖ్యమంత్రి ప్రస్తావించారు. వీసా ఇంటర్వ్యూ స్లాట్లను పెంచాలని, వీసా దరఖాస్తుల పరిశీలనను వేగవంతం చేయాలని కోరారు.
అమెరికాలో ఉద్యోగాలు చేస్తున్న తెలంగాణకు చెందిన వివిధ రంగాల నిపుణుల సమస్యలను కూడా రాయబారి దృష్టికి సీఎం తీసుకెళ్లారు. హెచ్-1-బీ వీసా ప్రాసెసింగ్, రెన్యువల్, వీసా స్టాంపింగ్ ఆలస్యం కాకుండా సరళతరం చేయాలని కోరారు. వీసా నిబంధనల్లో వచ్చే మార్పులపై ముందుగానే సమాచారం అందించాలని సూచించారు. అమెరికాలో చదువుతున్న తెలంగాణ విద్యార్థుల భద్రత, సంక్షేమంపై కూడా ఆయనతో చర్చించారు.
పెట్టుబడులకు ఆహ్వానం
– తెలంగాణలో విద్య, ఉపాధి, పెట్టుబడులు, సాంకేతిక పరిజ్ఞానం, పరిశోధన రంగాల్లో సహకారాన్ని బలోపేతం చేయాలని అమెరికా రాయబారి సెర్జియో గోర్‌ను ముఖ్యమంత్రి రేవంత్ కోరారు.
– అమెరికా సంస్థలు పెట్టుబడులు పెట్టడానికి తెలంగాణలో విస్తృత అవకాశాలు ఉన్నాయని ముఖ్యమంత్రి వివరించారు. ఐటీ, ఏఐ, లైఫ్ సైన్సెస్, ఫార్మా, స్టార్టప్‌లు, పరిశోధన, ఆధునిక సాంకేతిక రంగాల్లో భాగస్వామ్యానికి రాష్ట్రం సిద్ధంగా ఉందని తెలిపారు.
– అమెరికా విశ్వవిద్యాలయాలు తెలంగాణ విద్యాసంస్థలతో కలిసి పనిచేసేలా సహకరించాలని ఆయన కోరారు. పరిశోధన, ఆవిష్కరణలు, నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలను విస్తరించాలని సూచించారు.
– అమెరికాలో వేగంగా విస్తరిస్తున్న భారతీయ భాషల్లో తెలుగు ఒకటని ముఖ్యమంత్రి గుర్తుచేశారు.
– భారతదేశ చరిత్ర, సంస్కృతిపై రాయబారి సెర్జియో గోర్‌కు ఉన్న అవగాహన తనను ఆకట్టుకున్నదని సీఎం రేవంత్ రెడ్డి మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో తెలిపారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు, వంటకాలు, వివిధ రంగాల్లో రాష్ట్రం సాధిస్తున్న విజయాలపై రాయబారి చూపిన ఆసక్తిని ముఖ్యమంత్రి అభినందించారు.
– తెలంగాణ–అమెరికా మధ్య వ్యాపారం, పెట్టుబడులు, సాంస్కృతిక మార్పిడి, ప్రజల మధ్య సంబంధాలను మరింత విస్తరించేందుకు సంపూర్ణ సహకారం అందిస్తామని రాయబారి సెర్జియో గోర్ హామీ ఇచ్చారు.

