Mobile Popup Ad
Mobile Popup Ad

ప్రతి నెలా మూడు జాబ్ నోటిఫికేషన్స్.. రేపటి నుంచి కొత్త విధానానికి టీజీపీఎస్సీ శ్రీకారం

కలం, తెలంగాణ బ్యూరో : రాష్ట్ర ప్రభుత్వం గతేడాది ప్రకటించిన జాబ్ క్యాలెండర్ ప్రకారం ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి కదలిక మొదలైంది. రాష్ట్ర ఆవిర్భావం దినోత్సవం రోజునే తొలి నోటిఫికేషన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TGPSC) నుంచి వెలువడనున్నది. ప్రభుత్వం నుంచి వచ్చిన వివరాల ప్రకారం ఫస్ట్ నోటిఫికేషన్ 3,800 పోస్టులకు వెలువడనున్నది. ఇకపైన ప్రతి నెలా మూడు జాబ్ నోటిఫికేషన్లు వస్తాయని పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ బుర్రా వెంకటేశం తెలిపారు. ఉద్యోగాల భర్తీలో వేగాన్ని పెంచడంతో పాటు అవకతవకలకు తావు లేకుండా కొత్త మార్పులను తేనున్నట్లు వివరించారు.

రిక్రూట్‌మెంట్ ప్రక్రియను పారదర్వకంగా నిర్వహిస్తామని, నిరుద్యోగుల్లో నమ్మకం కలిగించేలా టెక్నాలజీని కూడా వినియోగిస్తామని తెలిపారు. మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, క్రమం తప్పకుండా ప్రతి నెలా మూడు జాబ్ నోటిఫికేషన్లు ఇకపైన వెలువడతాయన్నారు. ఉద్యోగ నియామకాల్లో మొదట నోటిఫికేషన్, తర్వాత పరీక్ష, ఆపై మెరిట్ లిస్ట్, చివరిగా సెలక్షన్ లిస్ట్ అనే పారదర్శక విధానాన్ని ఖచ్చితంగా పాటిస్తామని, ఎలాంటి లోపాలు లేవనే నమ్మకాన్ని అభ్యర్థుల్లో కలిగిస్తామన్నారు.

రిక్రూట్‌మెంట్‌కు ఏడాది మాగ్జిమమ్ టైమ్ :

ఉద్యోగాల భర్తీ కోసం పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఒకసారి నోటిఫికేషన్ జారీచేస్తే గరిష్టంగా ఏడాది లోపు పరీక్షలు నిర్వహించడం, ఫలితాలను వెల్లడించడం, కౌన్సిలింగ్ పూర్తిచేయడం, అపాయింట్‌మెంట్ లెటర్లను అందజేయడం.. ఇవన్నీ ఏడాది కాలం లోపే పూర్తి చేయాలని టార్గెట్ పెట్టుకున్నట్లు బుర్రా వెంకటేశం వివరించారు. అన్ని నోటిఫికేషన్లకు, రిక్రూట్‌మెంట్‌లకు ఇది వర్తిస్తుందన్నారు. ఇకపైన కమిషన్ నిర్వహించే పరీక్షలన్నీ పూర్తిగా కంప్యూటర్ ఆధారిత ఆన్‌లైన్ మోడ్‌లోనే జరుగుతాయని స్పష్టం చేశారు. దీనివల్ల పేపర్ లీకేజీలకు అవకాశం ఉండదన్నారు.

పరీక్ష పేపర్‌ను ముందుగానే తయారు చేసుకోవాలన్న పరిమితులు కూడా ఉండవన్నారు. పరీక్షకు ఒక గంట ముందు కూడా ప్రశ్నాపత్రాన్ని రూపొందించవచ్చన్నారు. పరీక్ష రాసిన వెంటనే ఎన్ని ప్రశ్నలకు సరైన సమాధానాలు రాశారో కూడా తెలిసిపోయే టెక్నాలజీని తీసుకువస్తున్నట్లు సూచనప్రాయంగా తెలిపారు. అప్లై చేసుకున్నవారందరికీ ఉద్యోగాలు రావని, 0.1 శాతం మందికి మాత్రమే ఉద్యోగాలు లభిస్తాయని, నిరుత్సాహానికి గురైనవారు కమిషన్‌మీద దుష్ప్రచారం చేయడం సహజమేనని ఒక ప్రశ్నకు సమాధానంగా వివరణ ఇచ్చారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>