Mobile Popup Ad
Mobile Popup Ad

బదిలీలపై మళ్ళీ నిషేధం.. అమల్లోకి వచ్చిన ఉత్తర్వులు

కలం, తెలంగాణ బ్యూరో : ప్రభుత్వ ఉద్యోగుల జనరల్ ట్రాన్స్‌ఫర్స్ నెల రోజుల గడువు ముగిసింది. రాష్ట్రవ్యాప్తంగా బదిలీలపై మళ్ళీ నిషేధం (Telangana Employees) జూన్ 1 నుంచి అమల్లోకి వచ్చింది. పూర్తిస్థాయి నిషేధాన్ని విధిస్తూ ఆర్థిక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సందీప్ కుమార్ సుల్తానియా పేరిట కీలక ఉత్తర్వులు జారీ చేశారు. నిషేధాన్ని మే 1 నుంచి నెల రోజుల పాటు సడలిస్తూ జారీ అయిన ఉత్తర్వుల గడువు ముగిసింది. సాధారణ బదిలీలపై మళ్లీ నిషేధం అమల్లోకి వచ్చినా పరిపాలనకు ఇబ్బంది లేకుండా ఉండేందుకు ప్రత్యేక సందర్భాలలో ఖాళీలు ఉన్న చోట ఇతర ఉద్యోగులను కదల్చకుండా పోస్టింగ్‌లు ఇవ్వడానికి అనుమతి ఉంటుంది.

ప్రమోషన్లు వచ్చినప్పుడు ఖాళీగా ఉన్న స్థానాల్లో పోస్టింగ్, పోస్టుల రద్దు, రివర్షన్లు, మాతృ సంస్థలకు తిరిగి పంపడం, డిప్యూటేషన్లు, క్రమశిక్షణా చర్యలు ఎదుర్కొంటున్న సందర్భాలలో పోస్టింగ్‌లు ఇవ్వడానికి బదిలీ నిషేధపు ఉత్తర్వులతో ఎలాంటి ఇబ్బందులు ఉండవని సందీప్ కుమార్ సుల్తానియా క్లారిటీ ఇచ్చారు. ఆరు నెలల కంటే ఎక్కువ కాలం సుదీర్ఘ సెలవుపై వెళ్లి, తిరిగి విధుల్లో చేరే ఉద్యోగులకు కూడా ఖాళీకి అనుగుణంగా పోస్టింగ్ ఇచ్చే వెసులుబాటు ఉంటుంది. ఆర్థిక శాఖ అనుమతి లేకుండా నేరుగా నియామక అధికారి అలాంటి పోస్టింగ్ ఆర్డర్స్ ఇవ్వొచ్చు. ఆరు నెలల లోపు ఉండే సాధారణ లేదా ఆర్జిత సెలవుల వల్ల ఏర్పడే తాత్కాలిక ఖాళీలను మాత్రం బదిలీ పేరుతో భర్తీ చేయడానికి వీల్లేదు.

మరో ఆరు నెలల పాటు అమల్లో నిషేధం :

ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి జారీ చేసిన ఉత్తర్వులతో జూన్ 1 నుంచి రాబోయే ఆరు నెలల వరకు సాధారణ బదిలీలకు అవకాశం లేదు. ప్రత్యేక పరిస్థితుల్లో మినహాయింపు లేదా సడలింపు ప్రతిపాదనలను సైతం ఏ డిపార్టుమెంటూ స్వీకరించడానికి అవకాశం లేదు. ఏదేని పరిస్థితుల్లో ఆరు నెలల తర్వాత అత్యవసరంగా బదిలీ చేయాల్సి వస్తే అలాంటి సడలింపుపై సంబంధిత సెక్రటేరియట్ అడ్మినిస్ట్రేటివ్ డిపార్ట్‌మెంట్ నోట్ ఫైల్‌ను తయారు చేసి ఆర్థిక శాఖ కార్యదర్శి లేదా ప్రధాన కార్యదర్శి లేదా సంబంధిత శాఖ మంత్రి లేదా ఆర్థిక శాఖ మంత్రి ద్వారా ముఖ్యమంత్రి ఆమోదం పొందడం తప్పనిసరి.

ఒకవేళ పరిపాలనా అవసరాల కోసం ఖాళీలను భర్తీ చేయాల్సి వస్తే ప్రస్తుతం పని చేస్తున్న స్టేషన్‌లో కనీసం ఏడాది యాక్టివ్ సర్వీస్ పూర్తి చేసుకున్న వారిని మాత్రమే పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది. దానికి సరైన కారణాలతో కూడిన జస్టిఫికేషన్ నివేదికను సమర్పించడం తప్పనిసరి. ఆర్థిక శాఖ అనుమతి కూడా కంపల్సరీ. ఈ నిబంధనలకు విరుద్ధంగా బదిలీ జరిగితే సంబంధిత అధికారులపై కఠిన చర్యలు ఉంటాయని సుల్తానియా ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. నిబంధనలకు విరుద్ధంగా బదిలీ అయిన ఉద్యోగుల పే-బిల్లులను ఆమోదించవద్దంటూ ట్రెజరీ డైరెక్టర్, పే అండ్ అకౌంట్స్ ఆఫీసర్, డైరెక్టర్ ఆఫ్ వర్క్స్ అకౌంట్స్ అధికారులకు ఆయన స్పష్టమైన ఆదేశాలు జారీచేశారు. ఆఉద్యోగుల జీతాలు కూడా ఆగిపోతాయని పేర్కొన్నారు. ఈ ఉత్తర్వులను సెక్రటేరియట్ విభాగాలు, హెచ్ఓడీలు, జిల్లా కలెక్టర్లు అందరూ ఖచ్చితంగా పాటించాలని స్పష్టం చేశారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>