కలం, వెబ్‌డెస్క్: ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్‌ల టికెట్ల పేరుతో జరుగుతున్న ఆన్‌లైన్ మోసాలపై తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో (TGCSB) డైరెక్టర్ శిఖా గోయల్ ఒక అధికారిక ప్రకటన విడుదల చేస్తూ ప్రజలను అప్రమత్తం చేశారు. సోషల్ మీడియా, నకిలీ వెబ్‌సైట్‌లు, వాట్సాప్, టెలిగ్రామ్ గ్రూపుల ద్వారా వీఐపీ, వీవీఐపీ పాస్‌ల పేరిట భారీ డిస్కౌంట్లు ఇస్తామంటూ సైబర్ నేరగాళ్లు వల విసురుతున్నట్లు ఆమె వెల్లడించారు. చివరి నిమిషంలో ఆఫర్లు ఉన్నాయంటూ అమాయకులకు నకిలీ టికెట్లను విక్రయించి భారీగా డబ్బులు గుంజుతున్నారని, ఇలాంటి ప్రకటనలు నమ్మి ఎవరూ మోసపోవద్దని ఆమె హెచ్చరించారు. ఐపీఎల్ మ్యాచ్‌ల అధికారిక టికెట్స్ బుకింగ్స్ కోసం కేవలం డిస్ట్రిక్ట్ యాప్ మాత్రమే ఉందని టీజీసీఎస్బీ స్పష్టం చేసింది. ఈ యాప్‌ను పోలిన నకిలీ యాప్‌లు , వెబ్‌సైట్‌ల పట్ల జాగ్రత్తగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు. ఒక వేళ ఎవరైనా ఐపీఎల్ టికెట్ల పేరుతో సైబర్ మోసాల బారిన పడితే, ఏ మాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే హెల్ప్‌లైన్ నెంబర్ 1930 కి కాల్ చేసి ఫిర్యాదు చేయాలని సూచించారు.

