కలం, నాగార్జున సాగర్ : నాగార్జున సాగర్ లోని అంతర్జాతీయ పర్యాటక బౌద్ధ కేంద్రం బుద్ధవనంని (Buddhavanam) బుధవారం తెలంగాణ రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యులు సందర్శించారు. మంగళవారం కమిషన్ చైర్ పర్సన్ కొత్తకోట సీతా దయాకర్ రెడ్డి, సభ్యులు బండి అపర్ణ, గొగుల సరిత, కంచర్ల వందన గౌడ్, మర్రిపల్లి చందన, ప్రేమలత అగర్వాల్, వచన కుమార్ లతో కలిసి సాగర్ లోని గురుకుల పాఠశాల సందర్శించి విద్యార్థులకు అందుతున్న సౌకర్యాల గురించి సమస్యలపై పరిశీలించారు.
సాగర్ సందర్శనలో భాగంగా నాగార్జునకొండ మ్యూజియాన్ని, బుద్ధవనంని సందర్శించారు. బుద్ధ వనంలోని బుద్ధ చరితవనం, ధ్యానవనం, స్థూపవనాలను సందర్శించిన అనంతరం మహాస్తూపం సమావేశ మందిరంలోని బుద్ధ వనం వివరాలు తెలిపే లఘు చిత్రాన్ని వీక్షించారు. ఈ సందర్భంగా మహాస్థూపంలోని ధ్యాన మందిరంలో బుద్ధవనం ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ శాసన, ఎస్టేట్ ఆఫీసర్ రవిచంద్రలు వీరితో బుద్ధ జ్యోతులు వెలిగింప చేసి బుద్దవనం కండువాలతో, బ్రోచర్లతో సత్కరించారు.
ఈ సందర్భంగా కమిషన్ చైర్ పర్సన్ సీతా దయాకర్ రెడ్డి మాట్లాడుతూ, బుద్ధవనం సందర్శన ప్రశాంత వాతావరణంలో తమకెంతో ఆహ్లాదాన్ని, ప్రశాంతతను కల్పించిందన్నారు. వీరికి స్థానిక టూరిజం గైడు సత్యనారాయణ వీరికి నాగార్జునసాగర్ డ్యాం, నాగార్జునకొండ, బుద్ధవనం విశేషాలను వివరించారు. వీరితోపాటు జిల్లా బాలల హక్కుల పరిరక్షణ అధికారి గణేష్, మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారి వేణుగోపాల్, బాలల హక్కుల పరిరక్షణ శాఖ అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.

