కలం, ఖమ్మం బ్యూరో: మహిళా సమానత్వ దినోత్సవం సందర్భంగా ప్రతి మహిళకు సమాన హక్కులు, సమాన అవకాశాలు, సమాన గౌరవం దక్కే సమాజ నిర్మాణానికి ప్రతీ ఒక్కరూ కృషి చేయాలని మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత పువ్వాడ అజయ్ కుమార్ (Puvvada Ajay Kumar) పిలుపునిచ్చారు. ఈ మేరకు బుధవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. మహిళా సమానత్వం అనేది కేవలం నినాదాలకే పరిమితం కాకూడదని, ఆచరణలో స్పష్టంగా కనిపించాలని ఆయన ఉద్ఘాటించారు. మహిళల సాధికారతతోనే ప్రతి కుటుంబం, సమాజం మరింత పురోగతి సాధిస్తాయని స్పష్టం చేశారు.
మహిళల సంక్షేమం, సాధికారత కోసం అనేక పథకాలు అమలు చేస్తామని ఎన్నికల సమయంలో ఆచరణ సాధ్యం కాని హామీలు ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ, అధికారంలోకి వచ్చాక వాటిని నెరవేర్చడంలో పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. మహిళలకు ఆర్థిక భరోసా కల్పిస్తామని, కుటుంబాలపై ఆర్థిక భారాన్ని తగ్గిస్తామని, యువతులకు విస్తృత ఉపాధి అవకాశాలు కల్పిస్తామని చెప్పి ఇప్పుడు పూర్తిగా విస్మరించిందన్నారు. హామీల అమలులో ఏమాత్రం స్పష్టత లేకపోవడంతో రాష్ట్రంలోని మహిళలు తీవ్ర నిరాశకు గురవుతున్నారని, మాటలకే పరిమితమై కాంగ్రెస్ ప్రభుత్వం వారిని దగా చేసిందని మండిపడ్డారు.
గతంలో కేసీఆర్ నాయకత్వంలోని బీఆర్ఎస్ ప్రభుత్వం మహిళల సంక్షేమం, భద్రత, ఆర్థిక సాధికారతకు అత్యున్నత ప్రాధాన్యతనిచ్చి అనేక సంక్షేమ కార్యక్రమాలను విజయవంతంగా అమలు చేసిందని గుర్తుచేశారు. కేసీఆర్ పాలనలోనే మహిళా సంక్షేమానికి పెద్దపీట వేసి, వారి జీవితాల్లో వెలుగులు నింపిన ఘనత దక్కిందన్నారు. కేవలం కాగితాలకే పరిమితమయ్యే పథకాలను ప్రకటించడం కాకుండా, వాటిని క్షేత్రస్థాయిలో సమర్థవంతంగా అమలు చేసి మహిళల జీవన ప్రమాణాల్లో నిజమైన మార్పు తీసుకురావాల్సిన బాధ్యత ప్రస్తుత పాలకులపై ఉందని గుర్తుచేశారు.

