ఆడబిడ్డ పెళ్లికి ముందే ఆర్థిక భరోసా.. రవీందర్ సింగ్ ఔదార్యం

కలం, కరీంనగర్: కరీంనగర్ నగర రాజకీయాల్లో ప్రజలకు అత్యంత చేరువగా ఉండే కరీంనగర్ మాజీ మేయర్, రాష్ట్ర సివిల్ సప్లయ్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ రవీందర్ సింగ్ మరోసారి తన నిబద్ధతను, ప్రజల పట్ల తనకున్న ఆత్మీయతను చాటిచెప్పారు. తన 58వ డివిజన్ కు చెందిన దుర్శెట్టి ప్రసూన–మహేంద్ర చారి దంపతుల పుత్రిక అనుశ్రీ–శ్రీనివాస చారి వివాహ మహోత్సవానికి రవీందర్ సింగ్ హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు.

మున్సిపల్ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని కేవలం మాటలకే పరిమితం చేయకుండా ముందుగానే కార్యరూపంలోకి తీసుకువచ్చి, ఆడబిడ్డ వివాహానికి రూ.25,000 ఆర్థిక సహాయంతో పాటు పట్టుచీరను కానుకగా అందజేసి కుటుంబానికి అండగా నిలిచారు. కుటుంబ సభ్యులను ఆప్యాయంగా పలకరించి, వధూవరులతో ముచ్చటిస్తూ వారి దాంపత్య జీవితం సుఖసంతోషాలతో నిండాలని ఆకాంక్షించారు.

ఈ సందర్భంగా  రవీందర్ సింగ్  మాట్లాడుతూ, “ప్రజలు నమ్మి ఇచ్చిన ప్రతి ఓటు నాకు బాధ్యత. ఎన్నికల సమయంలో ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడం ప్రతి ప్రజా ప్రతినిధి కర్తవ్యం. ప్రజల కష్టాల్లోనే కాదు… వారి సంతోషాల్లో కూడా భాగస్వామ్యం కావడమే నిజమైన ప్రజా సేవ” అని పేర్కొన్నారు. ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలకు అండగా నిలవడం తనకు ఎంతో సంతృప్తినిస్తుందని, ప్రజల విశ్వాసమే తనకు అతిపెద్ద బలమని అన్నారు. నగర ప్రజలు తనపై ఉంచిన నమ్మకంతో వరుసగా ఆరు సార్లు కార్పొరేటర్‌గా గెలిపించారని గుర్తుచేస్తూ, ఆ విశ్వాసాన్ని ఎప్పటికీ నిలబెట్టుకుంటానని స్పష్టం చేశారు.

ఎన్నికల సమయంలో ఇచ్చిన మాట… పెళ్లికి ముందే ఆర్థిక సహాయం… పట్టుచీరతో ఆడబిడ్డకు కానుక… పెళ్లి వేడుకకు స్వయంగా హాజరై ఆశీర్వాదం… ఇలా మాట నుంచి చేతల వరకు తన నిబద్ధతను చూపించారని స్థానికులు ప్రశంసించారు. ప్రజల కష్టసుఖాల్లో భాగస్వామ్యం అవుతూ, వారి కుటుంబాల్లో జరిగే శుభకార్యాలకు ఆత్మీయంగా హాజరవుతూ కుటుంబ సభ్యుడిలా పలకరించడం రవీందర్ సింగ్ కి ప్రజలతో ఉన్న అనుబంధానికి నిదర్శనమని వారు పేర్కొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>