ఓటుకు నోటు కేసు విచారణలో కీలక పరిణామం

కలం, వెబ్ డెస్క్: ఓటుకు నోటు కేసు (Vote For Note Case) విచారణలో సుప్రీం కోర్టులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఫిర్యాదుదారుడైన నామినేటెడ్ మాజీ ఎమ్మెల్యే స్టీఫన్‌సన్ తన వాదనలను కూడా పరిగణనలోకి తీసుకోవాలని వేసిన ఇంప్లీడ్ పిటిషన్‌ను సుప్రీం కోర్టు ధర్మాసనం పరిగణనలోకి తీసుకుంది. ఈ కేసులో తానే ప్రధాన ఫిర్యాదుదారుడిని కాబట్టి.. విచారణలో తన వాదనలు వినిపించుకునే అవకాశం ఇవ్వాలని కోరారు. ఇందుకు అంగీకరించిన అత్యున్నత న్యాయస్థానం పది రోజులకు విచారణ వాయిదా వేసింది.

సెప్టెంబర్ 17న జరిగిన విచారణ సందర్భంగా కేసులో ఏ1గా ఉన్న ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి.. కేసును కొట్టేయాలని కోరారు. ఆయన తరఫున సీనియర్ లాయర్ సిద్ధార్థ్ లూథ్రా వాదనలు వినిపించారు. ఈ ఘటన 2015లో జరిగిందని.. 2018లో అవినీతి నిరోధక చట్టానికి సవరణలు చేసినందున తన క్లెయింట్‌కు వర్తించదని స్పష్టం చేశారు. ఈ అంశాన్ని మాత్రం కోర్టు పరిగణనలోకి తీసుకోలేదు. ఇప్పుడు స్టీఫెన్‌సన్ వాదనలు కూడా వింటామని సుప్రీం కోర్టు చెప్పడంతో తదుపరి విచారణపై ఆసక్తి నెలకొంది.

అసలు కేసు ఏంటీ..?

2015లో ఎమ్మెల్సీ ఎన్నికల్లో భాగంగా వేం నరేందర్ రెడ్డికి మద్దతు తెలపాలని అప్పటి టీడీపీ ఎమ్మెల్యేగా ఉన్న రేవంత్ రెడ్డి నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్‌సన్‌కు రూ.50 లక్షల లంచం ఇచ్చారనేది ప్రధాన ఆరోపణ. ఏసీబీ ఆడియో, వీడియోలతో పట్టుకున్న ఉదంతం అప్పట్లో తెలుగు రాష్ట్రాల్లో పెను సంచలనం రేపింది. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి ఉండగా.. మిగతావారిని కూడా నిందితుల జాబితాలో చేర్చింది. ప్రస్తుతం దీనిపై సుప్రీం కోర్టులో విచారణ ఇంకా కొనసాగుతూనే ఉంది. ఈ కేసులో సీఎం చంద్రబాబు ఆడియో ఒకటి వెలుగులోకి రావడం కూడా చర్చనీయాంశంగా మారింది. ఇది పూర్తిగా రాజకీయ ప్రేరేపిత కేసు అంటూ రేవంత్ రెడ్డి పలుమార్లు కొట్టిపారేశారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>