కలం, జోగులాంబ గద్వాల: ధరూర్ మండలం పెద్ద చింతరేవుల (Pedda Chintarevula) గ్రామంలో సోమవారం పట్టపగలే చోరి (Theft) జరిగింది. ఈ ఘటనలో సుమారు 2తులాల బంగారు ఆభరణాలు, రూ. 90 వేల నగదు అపహరణకు గురైంది. అయితే నిందితుడు వెంట తెచ్చుకున్న బైక్ ను అక్కడే వదిలేసి పరారయ్యాడు.
బాధితులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం .. ధరూర్‌మండలం పెద్దచింతరేవుల గ్రామానికి చెందిన తంబళి జయమ్మ వ్యక్తిగత పనుల మీద మూడు రోజుల క్రితం రాయచూర్‌కు వెళ్లింది. సోమవారం ఉదయం ఆమె కుమారులు మల్లికార్జున్, మహదేవ్ లు ఇంటికి తాళం వేసి పొలం వద్దకు వెళ్లారు.
పొలం పనులు ముగించుకుని ఇంటికి వచ్చిన మల్లికార్జున్ ఇంటి గేటు ఓపెన్ ఉండడంతో లోపలికి వెళ్తున్న క్రమంలో గమనించిన నిందితుడు ఇంట్లో నుంచి బయటకు వచ్చి గోడ దూకి పరారయ్యాడు. దీంతో దొంగను వెంబడించడంతో అక్కడ నుంచి పరారయ్యాడు. నిందితుడు తన వెంట తెచ్చుకున్న బైక్ ను అక్కడే వదిలేసి పరారయ్యాడు.
మల్లికార్జున్ ఇంట్లోకి వెళ్లి చూడగా బీరువాలో ఉన్న సుమారు రెండు తులాల బంగారు ఆభరణాలు, రూ.90,000 నగదును ఎత్తుకెళ్లినట్లు గుర్తించారు. దీంతో సమాచారం అందుకున్న ధరూర్ ఎస్ఐ నందీకర్ సంఘటనా స్థలానికి చేరుకుని, క్లూస్ టీమ్, డాగ్ స్క్వాడ్ సాయంతో కీలక ఆధారాలు సేకరించారు.
నిందితుడు వదిలివెళ్లిన బైక్ రిజిస్ట్రేషన్ వివరాలు మరియు పరిసర ప్రాంతాల్లోని సీసీటీవీ (CCTV) కెమెరా విజువల్స్ ఆధారంగా నిందితుడిని గుర్తించే ప్రక్రియను ముమ్మరం చేశారు. త్వరలోనే నిందితుడిని పట్టుకుని, అపహరణకు గురైన బంగారం, నగదును స్వాధీనం చేసుకుంటామని ధరూర్ ఎస్ఐ నందీకర్ వెల్లడించారు.

