కాళేశ్వరంపై నేడు హైకోర్టు తీర్పు

కలం, తెలంగాణ బ్యూరో : కాళేశ్వరం (Kaleshwaram) అవకతవకలపై జస్టిస్ పీసీ ఘోష్ సమర్పించిన నివేదికను (PC Ghose Report) రద్దు చేయాలంటూ హైకోర్టులో దాఖలైన పిటిషన్‌పై నేడు (ఏప్రిల్ 22) తుది తీర్పు వెలువడనుంది. ఈ నివేదికను రద్దు చేయాలని, దాని ఆధారంగా ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోకుండా ఆదేశాలు ఇవ్వాలని కేసీఆర్, హరీశ్‌రావు, రిటైర్ట్ బ్యూరోక్రాట్ ఎస్‌కే జోషి, మహిళా ఐఏఎస్ ఆఫీసర్ స్మితా సభర్వాల్ హైకోర్టులో గతేడాది సెప్టెంబరులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై నవంబరు చివరి వరకూ పలుమార్లు విచారణ జరిగింది. ఈ నలుగురిపై కఠిన చర్యలు తీసుకోవద్దంటూ ప్రభుత్వానికి మధ్యంతర స్టే ఉత్తర్వులు జారీచేసింది. పిటిషనర్ల తరఫున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాదులు ఆర్యమ సుందరం, దామా శేషాద్రి నాయుడు హాజరై ఈ ఏడాది ఫిబ్రవరి-మార్చి నెలల్లో తుది వాదనలు వినిపించారు. ఏప్రిల్ 8న తుది తీర్పు వెల్లడించనున్నట్లు హైకోర్టు బెంచ్ ప్రకటించినా తీర్పు కాపీ రెడీ కాకపోవడంతో ఏప్రిల్ 22కు వాయిదా వేసింది. ఆ ప్రకారం తుది తీర్పు వెలువడనున్నది.

బీఆర్ఎస్ నేతల్లో టెన్షన్.. టెన్షన్.. :

కాళేశ్వరం (Kaleshwaram) అవకతవకలు, అవినీతి, నిబంధనల ఉల్లంఘన, మూడు బ్యారేజీల డ్యామేజ్.. ఇలా అన్నింటా అప్పటి ముఖ్యమంత్రిగా కేసీఆర్, ఇరిగేషన్ మంత్రిగా హరీశ్‌రావులది కీలక పాత్ర అని, ఈ నిర్వాకానికి వారే బాధ్యులు అని జస్టిస్ పీసీ ఘోష్ తన నివేదికలో పేర్కొన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన అనేక కీలక నిర్ణయాలకు క్యాబినెట్ ఆమోదం లేదని, నిబంధనల ఉల్లంఘన జరిగిందని, డీపీఆర్‌కు విరుద్ధంగా డెసిషన్లు జరిగాయని, నిర్మాణం సమయంలో తరచూ డిజైన్లు మారాయని, కేసీఆర్ ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకున్నారని ఆ నివేదికలో జస్టిస్ ఘోష్ పేర్కొన్నారు. దీంతో హైకోర్టు తుది తీర్పులో ఎలాంటి ఆర్డర్ ఇస్తుందన్నది ఆసక్తికరంగా మారింది. కేసీఆర్, హరీశ్‌రావులకు వ్యతిరేకంగా వస్తే బీఆర్ఎస్ శ్రేణులు ఎలాంటి గందరగోళానికి గురికాకుండా పార్టీ ఇప్పటికే ముందుజాగ్రత్త చర్యలు తీసుకున్నది.

తీర్పు ఎలా వచ్చినా హైకోర్టులో అప్పీల్ :

హైకోర్టు తీర్పు ఎవరికి అనుకూలంగా వచ్చినా, ఎవరికి ప్రతికూలంగా వచ్చినా సుప్రీంకోర్టులో అప్పీల్ చేసే అవకాశాలున్నాయి. హరీశ్‌రావు, మాజీ ఎంపీ వినోద్ ఆగమేఘాల మీద ఢిల్లీకి వెళ్ళి సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాదులతో సంప్రదింపులు జరపడం గమనార్హం. కేసీఆర్, హరీశ్‌రావులకు వ్యతిరేకంగా హైకోర్టు తీర్పు వస్తే దాన్ని సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేయనున్నారు. ఒకవేళ వారికి అనుకూలంగా వస్తే ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించనున్నది. తీర్పు ఎలా ఉన్నా చివరకు సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలు కావడం అనివార్యం. ఈ విచారణ అక్కడ ఎన్ని రోజుల పాటు కొనసాగుతుందనేది కీలకం. ఇప్పటికే రెండున్నరేళ్లుగా నానుతుండడంతో సుప్రీంకోర్టు ఫైనల్ జడ్జిమెంట్ ఇచ్చేవరకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టడానికి అవకాశాలు తక్కువ. మరోవైపు ఈ కేసుపై సీబీఐ కూడా దర్యాప్తుకు సిద్ధమవుతున్నందున కోర్టు ఎలాంటి ఆంక్షలు విధిస్తుందన్న అనుమానాలూ నెలకొన్నాయి.

సుప్రీంకోర్టులో హరీశ్‌రావు కెవియట్ దాఖలు ? :

హైకోర్టులో తీర్పు అనుకూలంగా వచ్చినట్లయితే రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించే అవకాశం ఉందన్న ఆలోచనతో ఇప్పటికే కెవియట్ పిటిషన్ దాఖలు చేయడానికి రంగం సిద్ధమైనట్లు సమాచారం. దీంతో ప్రభుత్వం పిటిషన్ వేస్తే విచారణ చేపట్టే ముందు తమను సంప్రదించాలన్న షరతులో భాగంగానే ఈ ముందు జాగ్రత్త తీసుకున్నట్లు తెలిసింది. కాళేశ్వరం కేసు విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం సీరియస్‌గా తీసుకున్నందున ఏ అవకాశాన్నీ వదులుకోవద్దని బీఆర్ఎస్ నేతలు భావిస్తున్నారు. ఆకస్మికంగా ఢిల్లీ పర్యటన వెనక బీజేపీతో బేరసారాలాడడమేనని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఇప్పటికే కామెంట్ చేశారు. కల్వకుంట్ల కవిత సైతం ఆర్ఎస్ఎస్ నేతల ద్వారా బీజేపీతో రాయబారం జరిపేందుకే వెళ్ళారని వ్యాఖ్యానించారు.

Read Also: అజారుద్దీన్‌కు లైన్ క్లియర్ ?

Follow Us On: WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>