కలం, వెబ్ డెస్క్: ట్రాఫిక్ ఉల్లంఘనలకు పాల్పడినందుకు చలాన్ల పేమెంట్ పెండింగ్‌లో ఉంటే వాహనాన్ని ఎలా సీజ్ చేస్తారంటూ రాష్ట్ర ప్రభుత్వంపై హైకోర్టు (TG High Court) తీవ్ర స్థాయిలో స్పందించింది. చట్టపరంగా ప్రొసీడ్ కావడానికి బదులు వాహనాలను స్వాధీనం చేసుకోవడం, ఒరిజినల్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేటెను లాగేసుకోవడం ఎందుకు చేయాల్సి వస్తున్నదంటూ ట్రాఫిక్ పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసింది. వాహనాలను సీజ్ చేయొద్దంటూ జనవరి 20న జరిగిన విచారణ సందర్భంగా ప్రభుత్వానికి స్పష్టమైన ఆదేశాలు జారీచేసినా తిరిగి అదే విధానాన్ని ఎందుకు కొనసాగిస్తున్నారని ప్రశ్నించింది. ఇది కోర్టు థిక్కరణే అని వివరించి స్టేట్ హోం సెక్రటరీ, డీజీపీ, ట్రాఫిక్ జాయింట్ పోలీసు కమిషనర్, ట్రాన్స్‌పోర్ట్ కమిషనర్, చిక్కడ్‌పల్లి సీఐ, ఎస్‌ఐలకు నోటీసులు జారీచేసింది. కోర్టు జారీచేసిన ఉత్తర్వులను ఎందుకు పాటించడంలేదో అఫిడవిట్ రూపంలో వివరణ ఇవ్వాలంటూ తదుపరి విచారణను జూన్ 20వ తేదీకి వాయిదా వేసింది.
ట్రాఫిక్ చలాన్లు ఉన్నాయన్న కారణంగా వాహనాన్ని సీజ్ చేశారంటూ ట్రాఫిక్ పోలీసులకు వ్యతిరేకంగా రాఘవేంద్రచారి గతంలోనే హైకోర్టులో ఒక పిటిషన్‌ను దాఖలు చేశారు. దీనిపై ఇరు పక్షాల వాదనలను విన్న బెంచ్.. జనవరి 20న స్పష్టమైన ఉత్తర్వులు జారీచేసింది. వాహనాలను సీజ్ చేయొద్దని స్పష్టం చేసింది. ఈ ఉత్తర్వులను అమలు చేయడం లేదంటూ ఏప్రిల్ 9న జరిగిన ఉదంతాన్ని ప్రస్తావిస్తూ మల్లికార్జున అనే ఒక లాయర్ హైకోర్టును ఆశ్రయించారు. హెల్మెట్ బకిల్ లాక్ చేయలేదన్న కారణాన్ని చూపి వాహనాన్ని సీజ్ చేశారని, ఒరిజినల్ ఆర్సీని తీసుకున్నారని ఆ పిటిషన్‌లో మల్లికార్జున్ పేర్కొన్నారు. తెలంగాణ ప్రభుత్వానికి చెందిన టీ-వాలెట్‌లోని డిజిటల్ ఆర్సీ కాపీని చూపిస్తే ట్రాఫిక్ పోలీసులు అంగీకరించలేదన్నారు. మోటారు వాహన చట్టంలో డిజిటల్ కాపీకి వ్యాలిడిటీ ఉన్నా ట్రాఫిక్ పోలీసులు నిరాకరించారని పేర్కొన్నారు. వాదనలను విన్న హైకోర్టు డీజీపీ, హోం సెక్రటరీ, ట్రాఫిక్ జాయింట్ పోలీసు కమిషనర్, ట్రాన్స్‌పోర్ట్ కమిషనర్ తదితరులకు నోటీసులు జారీచేసింది.
Read Also: జాగృతి టు రక్షణ సేన… కవిత ట్విస్టుల మీద ట్విస్టులు
Follow Us On: Instagram

