కలం, మహబూబ్ నగర్ బ్యూరో : ప్రజావాణి కార్యక్రమంలో ప్రజలు సమర్పించే ఫిర్యాదులను అత్యంత ప్రాధాన్యతనిచ్చి సత్వరం పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ ఖుష్బూ గుప్తా (Khushboo Gupta) అధికారులను ఆదేశించారు. ముందస్తు అనుమతి లేకుండా ప్రజావాణికి గైర్హాజరైన ఏడుగురు అధికారులకు షోకాజ్ నోటీసులు జారీ చేయాలని ఆదేశించారు.
షోకాజ్ తర్వాత గైర్హాజరైతే అధికారులపై క్రమశిక్షణ చర్యలు తప్పవని కలెక్టర్ హెచ్చరించారు. సోమవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఖుష్బూ గుప్తా, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ మధుసూదన్ నాయక్, రెవెన్యూ అదనపు కలెక్టర్ జె.ఎల్.బి. హరిప్రియతో కలిసి ప్రజల నుంచి ఫిర్యాదులు, వినతులను స్వీకరించారు.
ఈ సందర్భంగా జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు తమ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువచ్చారు. భూ సమస్యలు, రెవెన్యూ, పింఛన్లు, సంక్షేమ పథకాలు, ఉపాధి, రహదారులు, తాగునీరు, గృహ నిర్మాణం తదితర అంశాలకు సంబంధించిన ఫిర్యాదులను ప్రజలు అధికారులకు సమర్పించారు. ప్రజావాణిలో 89 ఫిర్యాదులను అధికారులు స్వీకరించారు.
ప్రతి ఫిర్యాదును సంబంధిత శాఖల అధికారులు పరిశీలించి, సమస్య పరిష్కారానికి అవసరమైన చర్యలు వెంటనే చేపట్టాలని కలెక్టర్ సూచించారు. ప్రజల నుంచి వచ్చే ప్రతి వినతికి ప్రాధాన్యతనిస్తూ, ఫిర్యాదుల పరిష్కారంలో జాప్యం లేకుండా చర్యలు తీసుకోవాలని తెలిపారు. పరిష్కరించిన ఫిర్యాదుల వివరాలను ఎప్పటికప్పుడు నమోదు చేసి, సంబంధిత దరఖాస్తుదారులకు సమాచారం అందించాలని అధికారులను ఆదేశించారు.
ప్రజావాణికి అధికారులు తప్పనిసరిగా హాజరుకావాలి
ప్రజావాణి అనంతరం, అధికారులతో నిర్వహించిన సమావేశంలో జిల్లా కలెక్టర్ ఖుష్బూ గుప్తామాట్లాడుతూ, ప్రజావాణికి అన్ని.శాఖల అధికారులు తప్పనిసరిగా హాజరు కావాలి అని అన్నారు. ప్రజావాణి కార్యక్రమం ప్రభుత్వ పరంగా, జిల్లా స్థాయిలో అత్యంత ముఖ్యమైన కార్యక్రమమని, అత్యవసర పరిస్థితులు మినహా ఏ శాఖకు చెందిన అధికారి కూడా ప్రజావాణికి గైర్హాజరు కావడానికి అనుమతి లేదని స్పష్టం చేశారు.
అధికారిక సెలవులో ఉన్నవారు లేదా ముందస్తుగా స్పష్టమైన అనుమతి పొందినవారు మాత్రమే మినహాయింపునకు అర్హులని తెలిపారు. ఇకపై ప్రజావాణికి గైర్హాజరయ్యే అధికారులపై క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని కలెక్టర్ ఖుష్బూ గుప్తా హెచ్చరించారు. కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ మధుసూదన్ నాయక్, రెవెన్యూ అదనపు కలెక్టర్ హరిప్రియ, భూసేకరణ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ రాంరెడ్డి, డిపిఓ వెంకట రెడ్డి, వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

