కలం, వెబ్ డెస్క్: తెలంగాణ రాష్ట్రంలో రేపు (మంగళవారం) జనసేన (Jana Sena) నిర్వహించబోయే మీటింగ్‌పై తీవ్రమైన ఉత్కంఠ నెలకొన్నది. జనసేన సమావేశంపై అధికార కాంగ్రెస్ పార్టీకి చెందిన నేతలు, మంత్రులే అభ్యంతరం తెలపడం వివాదానికి కారణమైంది. మరోవైపు తాము సమావేశం నిర్వహించి తీరుతామని తెలంగాణకు చెందిన జనసేన నేతలు స్పష్టం చేస్తున్నారు. అసలు జనసేన నిర్వహించబోయే మీటింగ్ కు అనుమతి ఉందా? లేదా? అన్న ప్రశ్నలు కూడా వ్యక్తమవుతున్నాయి.
ఈ నేపథ్యంలో జనసేన తెలంగాణ రాష్ట్రానికి చెందిన సాగర్ సహా పలువురు నేతలు మీడియాతో మాట్లాడారు. తెలంగాణ ఎవడబ్బు సొత్తు కాదని.. కచ్చితంగా సమావేశం నిర్వహించి తీరుతామని వారు పేర్కొన్నారు. సమావేశానికి అనుమతి రాకపోతే ఏం జరుగుతుందో అందరికీ తెలుసన్నారు. పవన్ కల్యాణ్ మిగిలిన పార్టీ నేతల లాంటి వారు కాదని.. ఆయనకు స్పష్టమైన ఆశయాలు ఉన్నాయన్నారు.
పవన్ కల్యాణ్ వస్తున్నారంటే వేల సంఖ్యలో కార్యకర్తలు, నేతలు తరలివస్తారని చెప్పారు. మిగిలిన పార్టీల్లాగా తాము బీరు, బిర్యానీ ఇచ్చి ఎవరినీ ఆకర్షించబోమని స్పష్టం చేశారు. పవన్ కల్యాణ్ వస్తున్నారంటే ఎండలు ఉన్నా, వానలు ఉన్నా లెక్క చేయకుండా జనం భారీగా తరలివస్తారని చెప్పారు. ఆయన ఏం చెబుతారో వినాలని.. ఆయన ఆశయాలను అందిపుచ్చుకోవాలని జనం చూస్తున్నారని జనసేన నేతలు పేర్కొన్నారు.

