Mobile Popup Ad
Mobile Popup Ad

భద్రాద్రికి పోటెత్తిన భక్తజనం.. మే నెలలో రికార్డు స్థాయిలో దర్శనాలు!

కలం, ఖమ్మం బ్యూరో: దక్షిణ అయోధ్యగా ప్రసిద్ధి చెందిన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని శ్రీ సీతారామచంద్ర స్వామి (Bhadrachalam Temple) వారి క్షేత్రం భక్తుల రాకతో సరికొత్త రికార్డులను నమోదు చేస్తోంది. గత ఏడాది మే నెలతో పోలిస్తే ఈ ఏడాది మే నెలలో స్వామి వారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య గణనీయంగా పెరిగినట్లు ఆలయ వర్గాలు అధికారికంగా వెల్లడించాయి. గత ఏడాది మే నెలలో 2,88,103 మంది భక్తులు స్వామి వారిని దర్శించుకోగా, ఈ ఏడాది మే నెలలో ఆ సంఖ్య ఏకంగా 2,96,083కి చేరింది. వేసవి సెలవులు కావడం, ఉభయ తెలుగు రాష్ట్రాలతో పాటు పొరుగు రాష్ట్రాల నుండి కూడా భక్తులు పెద్ద సంఖ్యలో తరలిరావడంతో ఆలయ పరిసరాలు ఆధ్యాత్మిక శోభతో విరాజిల్లుతున్నాయి. ​తీవ్రమైన ఎండలు ఉన్నప్పటికీ భక్తుల ఉత్సాహం ఎక్కడా తగ్గలేదు. స్వామి వారి నిత్య కల్యాణం, దర్బార్ సేవ, సువర్ణ పుష్పార్చన వంటి విశేష సేవల్లో పాల్గొనేందుకు భక్తులు నిత్యం క్యూ కడుతున్నారు.

తెల్లవారుజాము నుంచే క్యూలైన్లు భక్తులతో నిండి పోతుండటంతో, ఆలయ అధికారులు దర్శన వేళలను సమన్వయం చేస్తూ రద్దీని నియంత్రిస్తున్నారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్, ఒడిశా, ఛత్తీస్‌గఢ్ వంటి సుదూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా దేవస్థానం అధికారులు ముందస్తుగా విస్తృత ఏర్పాట్లు చేశారు. ​క్యూలైన్లలో ఎండ తీవ్రత తగలకుండా చలవ పందిళ్లు వేయడంతో పాటు, వేచి ఉన్న భక్తులకు నిరంతరాయంగా తాగునీరు, మజ్జిగ పంపిణీ చేశారు. అలాగే పెరిగిన రద్దీకి అనుగుణంగా అదనపు కౌంటర్లను ఏర్పాటు చేసి భక్తులకు లడ్డు ప్రసాదాల కొరత లేకుండా చర్యలు తీసుకున్నారు. దూర ప్రాంతాల నుంచి వచ్చే వారి కోసం వసతి గదుల కేటాయింపును కూడా క్రమబద్ధీకరించారు. భక్తుల సంఖ్య ఏటా పెరుగుతుండటం ఇక్కడి ఆధ్యాత్మిక వైభవానికి అద్దం పడుతోందని, రద్దీ పెరిగినప్పటికీ అధికారులు సమర్థవంతంగా ఏర్పాట్లు చేయడం పట్ల భక్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>